చిన్న వయసులోనే చదువుకు దూరమై.. అమ్మ నేర్పిన పాఠాలతో

చిన్న వయసులోనే చదువుకు దూరమై.. అమ్మ నేర్పిన పాఠాలతో

ఫ్యామిలీ పరిస్థితుల వల్ల అన్సియా చిన్న వయసులోనే చదువుకి దూరమైంది. సింగిల్ పేరెంట్​గా తల్లి పడుతున్న కష్టాన్ని చూసి ఆమెకు అండగా నిలవాలనుకుంది. ఆ టైంలోనే అమ్మ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంది. డబ్బు ఆదా చేయడం కోసం నూనె, కాటుక, షాంపూ వంటివి వాళ్ల అమ్మే స్వయంగా తయారు చేయడం చూసి ఆశ్చర్యపోయింది. అమ్మ నేర్పిన పాఠాలతో పెద్దయ్యాక  స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తయారుచేయడం మొదలుపెట్టింది. ‘ఉమ్మీస్ నేచురల్స్’ స్టార్టప్‌తో ఇప్పుడు నెలకు లక్షల్లో సంపాదిస్తోంది.

అన్సియాది కేరళలోని పాలక్కాడ్. 24 ఏండ్ల వయసులోనే ‘ఉమ్మీస్ నేచురల్స్’ పేరుతో 40 రకాల హోమ్‌‌మేడ్ స్కిన్‌‌కేర్ ప్రొడక్ట్స్ తయారుచేస్తూ 30 మందికి ఉపాధి కల్పించింది. నెలకు  మూడు లక్షలకు పైగా టర్నోవర్ సాధిస్తోంది అన్సియా. ‘ఈ సక్సెస్‌‌కు కారణం మా అమ్మే’ అని చెప్తోంది. ‘చదువుకోకపోయినా అమ్మ ఇచ్చిన నాలెడ్జ్‌‌తోనే సక్సెస్ అయ్యా’నంటోంది.

అన్నీ ఇంట్లోనే..

తండ్రి ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో అన్సియా తల్లి తాహిరానే కుటుంబాన్ని పోషించేది. ఖర్చు తగ్గించడం కోసం ఇంటికి కావల్సిన వస్తువులన్నింటిని ఆమే స్వయంగా తయారుచేసేది. కూరగాయలు కూడా పెరట్లోనే పండించేది. పిల్లల కోసం కొబ్బరి నూనె, కాటుక, షాంపూ లాంటివి  సాంప్రదాయ పద్ధతుల్లో ఇంట్లోనే తయారుచేసేది. ఎప్పుడూ అమ్మతోపాటే ఉండే అన్సియా  ఆ తయారీ పద్ధతులన్నింటినీ దగ్గరుండి నేర్చుకుంది. రకరకాల స్కిన్‌‌కేర్ ప్రొడక్ట్స్ ఎలా తయారుచేయాలో వివరంగా అడిగి తెలుసుకుంది. సరదాగా నేర్చుకున్న వాటినే  ఆ తర్వాత స్టార్టప్‌‌ కోసం వాడుకుంది.

నేచురల్‌‌గా..

మొదలుపెట్టిన కొద్దిరోజుల్లోనే ‘ఉమ్మీస్’ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్‌‌కు  మంచి పాపులారిటీ వచ్చింది. సబ్బు, షాంపూ, హెయిర్ ఆయిల్, బాడీ లోషన్, మాయిశ్చరైజర్, ఫేస్ క్రీమ్, ఫేస్ వాష్.. ఇలా ఉమ్మీస్ ప్రొడక్ట్స్ అన్నీ పూర్తిగా సాంప్రదాయ పద్ధతుల్లోనే తయారవుతాయి. ప్రొడక్ట్స్ తయారీకి వాడే మూలికలను కూడా అన్సియా తన పెరట్లోనే పెంచుతుంది. అంతేకాదు ఏయే ప్రొడక్ట్ ఎలా తయారవుతుందో పూర్తిగా వీడియో తీసి ఇన్‌‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేస్తుంది. “ఉమ్మీస్ ప్రొడక్ట్స్ వాడే వాళ్లకు వాటిలో ఏయే ఇంగ్రెడియెంట్స్ ఉన్నాయో, వాటిని సహజంగా ఎలా తయారు చేస్తున్నామో పూర్తిగా తెలియాలనే ఇలా చేస్తున్నాం.

“చర్మానికి అప్లై చేసే ఏ క్రీమ్ అయినా కెమికల్స్ లేకుండా సహజంగా ఉండాలని అమ్మ చెప్పేది. అందుకే చిన్నప్పుడు షాపు నుంచి ఎలాంటి ఆయిల్స్, క్రీమ్స్‌‌ కొననిచ్చేది కాదు. వాటిలో కెమికల్స్ ఉంటాయేమో అన్న భయంతో. ఇప్పటికీ చాలామందికి ఈ భయం ఉంది. ప్రొడక్ట్ పైన ‘ఆర్గానిక్’, ‘నేచురల్’ అని రాసి ఉన్నా.. వాటి తయారీలో వాడే  ఇంగ్రెడియెంట్స్‌‌ను  దాచేస్తున్నాయి కొన్ని కంపెనీలు.  అలాగే దాన్ని ఎలా తయారుచేస్తున్నారు అనేవిషయాన్ని కూడా ఎక్కడా రాయట్లేదు. అందుకే నేను మేకింగ్ ప్రాసెస్‌‌ను కూడా క్లియర్‌‌‌‌గా చూపించాలనుకున్నా. అందుకే ప్రతీ ప్రొడక్ట్ ఎలా తయారవుతుందో వివరంగా వీడియోలు తీసి అప్‌‌లోడ్ చేస్తున్నాం” అని చెప్పింది. 

హౌజ్‌‌వైవ్స్ సాయంతో..

ఉమ్మీస్ ప్రొడక్ట్స్‌‌కు డిమాండ్ పెరగడంతో అన్సియాకు ఎక్కువ రా మెటీరియల్ కావాల్సి వచ్చింది. అందుకే పాలక్కాడ్‌‌లోని లోకల్ హౌజ్‌‌వైవ్స్ సాయంతో కలబంద, మందారం లాంటివాటిని సేకరిస్తోంది.  తగిన మార్కెట్ ధర చెల్లిస్తూ వాళ్లను  స్టార్టప్‌‌లో  పాలు పంచుకునేలా చేసింది. అన్సియా భర్త రంషీద్.. ప్రొడక్ట్స్ డిజైనింగ్, మార్కెటింగ్‌‌లో సాయం చేస్తాడు. ప్రస్తుతం ప్రొడక్ట్స్ అన్నీ ఇంట్లోనే తయారు చేస్తున్న అన్సియా త్వరలోనే ‘ఉమ్మీస్ నేచురల్స్’ ఫ్యాక్టరీని ఓపెన్ చేయాలనుకుంటోంది.  

మొదటి ఇన్వెస్ట్​‌మెంట్ అదే.. 
“ఉమ్మీస్ స్కిన్‌కేర్ మొదలుపెట్టేందుకు నా దగ్గర ఎలాంటి ఇన్వెస్ట్​మెంట్ లేదు. పెరట్లో పెంచిన ఉసిరి, కలబంద, తులసి, కరివేపాకుతో నూనె, ఫేస్ ప్యాక్ లాంటి  ప్రొడక్ట్స్ తయారు చేసి ఇన్‌స్టాగ్రామ్​లో పెడితే కొన్ని ప్రి ‌-‌ఆర్డర్స్ వచ్చాయి. నేను తయారుచేసిన ప్రొడక్ట్స్ కావాలంటూ చాలామంది ప్రి ‌-ఆర్డర్స్ రూపంలో కొంత డబ్బు చెల్లించారు. అలా ఐదువేల రూపాయలు పోగయ్యాయి. అదే నా మొదటి ఇన్వెస్ట్​మెంట్. ఇక ఆ తర్వాత ఆర్డర్లు ఇంకా పెరిగాయి. అన్నిరకాల స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ తయారుచేయాలంటూ చాలామంది నన్ను రిక్వెస్ట్ చేశారు. దాంతో నేను కొంతమంది ఆయుర్వేదిక్ ఎక్స్​పర్ట్స్​ని కలిసి సబ్బు, ఫేస్ వాష్ లాంటివి ఎలా తయారు చేయాలో నేర్చుకున్నా. అలా అన్నిరకాలప్రొడక్ట్స్​పై రీసెర్చ్ చేసి వాటిని సహజంగా ఎలా తయారుచేయాలో తెలుసుకున్నా” - అన్సియా