బంజరు భూమిని పచ్చని అడవిగా మార్చిండు

బంజరు భూమిని పచ్చని అడవిగా మార్చిండు

20 ఏండ్లపాటు 300 ఎకరాల్లో చెట్లు పెంచిన మణిపూర్​ వ్యక్తి

మణిపూర్: ప్రకృతి మీదున్న ప్రేమతో ఓ వ్యక్తి బంజరు భూమిని పచ్చని అడవిగా మార్చేశాడు. అనేక రకాల చెట్లను పెంచి ఏకంగా 300 ఎకరాల్లో పచ్చదనాన్ని నింపాడు. మణిపూర్ రాష్ట్రం ఇంఫాల్ జిల్లా ఉరిపోక్ ఖైడెం లైకై ప్రాంతానికి చెందిన మొయిరంగ్థెం లోయా అనే 47 ఏండ్ల వ్యక్తి 20 ఏండ్ల పాటు కష్టపడి ఈ అద్భుతాన్ని సాధించాడు. తమిళనాడులోని చెన్నైలో డిగ్రీ పూర్తయ్యాక లోయా తన 27వ ఏట సొంతూరుకి చేరుకున్నాడు. దగ్గరలోని కౌబ్రూ కొండ ప్రాంతానికి ట్రెక్కింగ్​కు వెళ్తుండగా ఆ ప్రాంతంలో జరిగిన అటవీ నిర్మూలన చూసి చలించిపోయాడు.

చిన్నతనం నుంచి ప్రకృతి అంటే ఎంతగానో ఇష్టపడే లోయా అక్కడ తిరిగి చెట్లు నాటాలని నిర్ణయించుకుని 2000 సంవత్సరం నుంచి మొక్కలు నాటడం మొదలు పెట్టాడు. అలా 20 ఏండ్లపాటు కొనసాగించాడు. లోయా ప్రయత్నానికి రాష్ట్ర అటవీ శాఖ కూడా మద్దతు తెలిపింది. ప్రస్తుతం ఆ 300 ఎకరాల్లో విస్తరించిన అడవిలో 100కు పైగా రకాల చెట్లు 25 రకాల వెదురు జాతులు, ఓక్, జాక్ ఫ్రూట్, టేకు చెట్లున్నాయి. ఈ అటవీ ప్రాంతం జింకలు, పాములకు నిలయంగా ఉందని అటవీ అధికారులు వెల్లడించారు. సాధారణంగా మొక్కలు కొనుగోలు చేసి వాటిని తీరిక సమయాల్లో నాటుతుంటా అని లోయా వెల్లడించాడు. తన జీవనోపాధికోసం ఫార్మసీ నడుపుతున్నానని చెప్తున్నాడు.

ప్రకృతికి తిరిగి ఇవ్వాలని..

‘‘కార్చిచ్చు వల్ల లాంగోల్ హిల్ ప్రాంతంలో అంతకుముందున్న దట్టమైన అడవి కనుమరుగయింది. మనం చేసే పనుల వల్ల కొండ ప్రాంతాలు, అడవులు నాశనం కావడం చూసి భయపడ్డాను. ప్రకృతి తల్లికి తిరిగి ఇవ్వాలనే బలమైన కోరిక కలిగింది. మొక్కలు నాటడం మొదలు పెట్టిన. వైల్డ్ లైఫ్ అండ్ హాబిటాట్ ప్రొటెక్షన్ సొసైటీని కూడా స్థాపించి ఇందులో ఉన్న జంతువులకు రక్షణ కల్పిస్తున్నా” - మొయిరంగ్థెం లోయా