మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ.. సెంట్రల్ కమిటీ కీలక సభ్యుడు రాంధీర్ మాఝీ లొంగుబాటు

మావోయిస్టు పార్టీకి మరో  ఎదురుదెబ్బ.. సెంట్రల్ కమిటీ కీలక సభ్యుడు రాంధీర్ మాఝీ లొంగుబాటు
  • ఎంఎంసీ జోన్​లో మడవి హిడ్మా స్థాయి నాయకుడు 
  • 12 మందితో కలిసి ఆయుధాలతో సహా సరెండర్
  • ఆయనపై కోటి రూపాయల రివార్డ్.. 61 కేసులు

హైదరాబాద్, వెలుగు: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సెంట్రల్​ కమిటీలో అతి కీలకమైన సభ్యుడు రాంధీర్ మాఝీ సోమవారం పోలీసులకు లొంగిపోయారు. 12 మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలు అప్పగిస్తూ చత్తీస్​ గఢ్​ ప్రభుత్వానికి సరెండర్​ అయ్యారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్​గఢ్ (ఎంఎంసీ) జోన్​లో మడవి హిడ్మా అంతటి నాయకుడు రాంధీర్. ఈ జోన్ కమాండర్​గా అతి కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాంధీర్ తన టీమ్​తో సహా లొంగిపోవడంతో ఇక ఎంఎంసీ జోన్​పై తమకు పట్టు చిక్కినట్లేననే పోలీసులు పేర్కొంటున్నాయి.

36 ఏళ్లుగా ఉద్యమంలో..
మావోయిస్ట్​ పార్టీ సెంట్రల్ కమిటీ మెంబర్ రాంధీర్ మాఝీది చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్​ జిల్లా మంజిమెట్ట గ్రామం. కుటుంబ సభ్యులు దేవ్ మాఝీ అని పిలుస్తుండేవారు. 1990లో మావోయిస్ట్ పార్టీలో చేరారు. 36 ఏళ్లుగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ (ఎంఎంసీ) జోన్‌లో కమాండర్​గా పనిచేస్తున్నారు.. మూడు రాష్ట్రాల పరిధిలోని బలాఘాట్, గొందియా, రాజ్ నంద్ గావ్, కబీర్ధామ్ ప్రాంతాలను కవర్ చేసేవారు. దశాబ్దాలుగా మావోయిస్ట్ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన రామ్​ధీర్​కు ఈ జోన్​లో మడవి హిడ్మా అంతటి స్థాయి లీడర్​గా గుర్తింపు ఉంది. ఆయనపై 61 కేసులు, రూ.కోటి రివార్డు ఉన్నట్లు పోలీసులు ప్రకటించారు.

కుప్పకూలిన ఎంఎంసీ జోన్​: పోలీసులు
చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని భైరంగఢ్ జిల్లా బకరకట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు రామ్​ధీర్ మాఝీ తన టీమ్​లోని12 మంది మావోయిస్టులతో కలిసి లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో డివిజన్ కమిటీ సభ్యులు చందు, వుసండి, లలిత, జానకి, ప్రేమ్, ఏరియా కమిటీ సభ్యులు రామసింగ్ దాదా, సురేశ్ కొట్టం, ప్లటూన్ పార్టీ మెంబర్లు లక్ష్మి, శీలం, సాగర్, కవిత, యోగిత తదితరులు ఉన్నారు. ఈ సరెండర్‌తో మూడు రాష్ట్రాలకు చెందిన ఎంఎంసీ జోన్ పూర్తిగా కుప్పకూలినట్లుగా పోలీసులు ప్రకటించారు.