
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక ఖాయం అని తేలినప్పటి నుంచే క్రిప్టో కరెన్సీలకు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద బూమ్ వచ్చేసింది. ఆయన అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఇది తారా స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఎంతలా అంటే ఏడాది కూడా ముగియకముందే ఇన్వెస్టర్ల సంపద దాదాపు డబుల్ అయ్యేంత. కానీ ప్రస్తుతం ట్రంప్ తీసుకోబోతున్న ఒక నిర్ణయం ఈ స్టోరీ మెుత్తాన్ని తలకిందులు చేసేసింది.
వివరాల్లోకి వెళితే.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనాపై అదనంగా 100 శాతం సుంకాలు విధించనున్నట్లు ప్రకటించడంతో ప్రపంచ క్రిప్టోకరెన్సీ మార్కెట్‌లో రికార్డు స్థాయి పతనం చోటు చేసుకుంది. కాయిన్ గ్లాస్ డేటా ఆధారంగా గత 24 గంటల్లో 16 లక్షలకు పైగా ట్రేడర్లు 19 బిలియన్ డాలర్లకు పైగా నష్టపోయారు. ఇందులో 7 బిలియన్ డాలర్ల విలువైన పొజిషన్లు అక్టోబర్ 10న ఒక్క గంటలోనే విక్రయించబడటం గమనార్హం. మొత్తం లిక్విడేషన్ $30 బిలియన్లకు మించి ఉండొచ్చని మల్టీకాయిన్ క్యాపిటల్ హెడ్ ట్రేడర్ బ్రియాన్ స్ట్రగాట్స్ అంచనా వేశారు. ఇది పెద్ద మార్కెట్ కాంటేజన్‌కు దారితీయవచ్చని అన్నారు.
కాయిన్ మార్కెట్ క్యాప్ ప్రకారం.. క్రిప్టో మార్కెట్ క్యాప్ అక్టోబర్ 10న 4.30 ట్రిలియన్ డాలర్ల నుంచి అక్టోబర్ 11న 3.74 ట్రిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ సమయంలో ట్రేడింగ్ వాల్యూమ్ 490.23 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ప్రపంచంలో అతిపెద్ద క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ విలువ 8.05 శాతం తగ్గి ఒక్కోటి లక్ష11వేల 542.91 డాలర్లకు పడిపోయింది. రెండో స్థానంలో ఉన్న ఈథీరియం ధర 12.71 శాతం పడిపోయి ఒక్కోటి 3వేల 778.31 డాలర్లకు చేరింది.
►ALSO READ | Zoho మెయిల్‌కి అన్ని Gmail ఈమెయిల్స్ ను.. ఒకేసారి ఇలా ఈజీగా ఫార్వార్డ్ చేసుకోండి
బిట్‌కాయిన్ లక్ష డాలర్ల స్థాయి వరకు పడిపోయి తదుపరి ప్రధాన సపోర్ట్ జోన్ కు చేరుకోవచ్చని ఆర్బిట్ మార్కెట్స్ సహ వ్యవస్థాపకురాలు కేరోలైన్ మౌరోన్ అంచనా వేశారు. అది కూడా దాటితే గత మూడు సంవత్సరాల బుల్ సైకిల్ ముగిసే అవకాశం ఉందని హెచ్చరించారు. Tread.fi సీఈఓ డేవిడ్ జీంగ్ ఈ పరిస్థితిని ‘బ్లాక్ స్వాన్ ఈవెంట్’గా వ్యాఖ్యానించారు. ఈ తరహా అరుదైన, ఊహించని మార్కెట్ షాక్ లు స్టాక్ మార్కెట్ లో కూడా అత్యంత అరుదుగా చోటు చేసుకుంటాయన్నారు. కాని లెవరేజ్ పెర్పెచువల్ ఫ్యూచర్స్ వల్ల పెద్ద ట్రేడర్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారీ నష్టాలు చవిచూశారని స్పష్టం చేశారు.