వరదల్లో పట్నం, వరంగల్.. జలదిగ్బంధంలో గ్రేటర్లు

వరదల్లో పట్నం, వరంగల్.. జలదిగ్బంధంలో గ్రేటర్లు
  • సిటీ.. పిటీ
  • వరదల్లో పట్నం, వరంగల్
  • జలదిగ్బంధంలో గ్రేటర్లు
  • పట్నంను ముంచెత్తిన మూసీ
  • భద్రకాళి చెరువు కట్ట ఎత్తు పెంపుతో వరంగల్ మునక
  • కరువైన ముందస్తు చర్యలు
  • రంగంలోకి పడవలు, హెలికాప్టర్లు
  • ఛత్రీలతో బైలెల్లిన మంత్రులు

తెలంగాణలోని రెండు మహానగరాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మూసీ ఉధృతితో భాగ్యనగరం అతలాకుతలమవుతోంది. భద్రకాళి చెరువు కట్ట ఎత్తు పెంపుతో చారిత్రక వరంగల్ నగరం జలదిగ్బంధంలో చిక్కుకున్నది. వరంగల్ నగరానికి 1983లో, 2007లో వరదలు వచ్చాయి. కానీ ఈ సారి వచ్చింది అప్పటికన్నా పెద్ద వరద అని స్థానికులు చెబుతున్నారు. భద్రకాళీ చెరువు సుందరీకరణలో భాగంగా కట్ట ఎత్తును పెంచారు. అయితే చెరువులోకి వచ్చిన నీరు బయటికి వెళ్లేందుకు తూములను నిర్మించలేదు. 

ఒక్కసారిగా బొందివాగు ఉధృతంగా ప్రవహించడంతో భద్రకాళి చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీని క్యాచ్ మెంట్ ఏరియాలో ఉన్న హంటర్ రోడ్డు నీట మునిగింది. తర్వాత ఎన్టీఆర్ నగర్, సాయినగర్, సంతోషిమాత కాలనీ, బృందావన్ కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని కాలం గడిపారు. భద్రకాళీ చెరువు సమీపంలోని టింబర్ డిపోలు, ఫర్నిచర్ వర్క్ షాపులు నీటమునిగాయి. తమ మిషనరీ కూడా కొట్టుకుపోయిందని బాధితులు చెబుతున్నారు. 

దాదాపు ఐదారు ఫీట్ల మేర వరద రావడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటపడ్డామంటున్నారు. మరోవైపు భద్రకాళీ ఆలయ పూజారులు వరదల్లో చిక్కుకొని గుడిలోనే ఉండిపోయారు. తమకు ఆహారం అందించాలని వేడుకుంటున్నారు. చారిత్రక వరంగల్ నగరం నాలుగు దశాబ్దాల తర్వాత తీవ్ర వరదల్లో కొట్టమిట్టాడుతుండటం గమనార్హం. ట్రైసిటీగా పేరున్న వరంగల్, కాజీపేట, హనుమకొండ వరదల్లో చిక్కకోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో 1983లో దాదాపు ఇదే స్థాయిలో వరద వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. 

ఆ తర్వాత 2007లో కురిసిన భారీ వర్షాలకు పలు కాలనీలు నీటమునిగాయి. వరంగల్ సిటీలో వరద నివారణ చర్యల కోసం పట్టాణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలో మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. ప్రస్తుతలం సిటీలోని నాలాలు చాలడం లేదని, కేవలం 12 క్యూసెక్కుల ప్రవాహాన్ని మాత్రం తట్టుకునేలా ఉన్నాయని, అంతకన్నా ఎక్కువగా నీరొస్తే కాలనీలు నీటమునుగుతాయని ఇంజినీర్లు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు 20 క్యూసెక్కుల సామర్థ్యాన్ని తట్టుకునేలా పెంచాలని, వాటికి రిటైనింగ్ వాల్ కూడా కట్టాలని ప్లాన్ చేశారు. 

నయీంనగర్, గోపాల్ పూర్, రాజాజీనగర్ లో నాలాలను ఆక్రమించినట్టు జీడబ్ల్యు ఎంసీ అధికారులు గుర్తించారు. కానీ వాటిని తొలగించే సాహసం చేయలేదు. కేటీఆర్ ఆధ్వర్యంలో రూపొందించిన ప్లాన్ కాగితాలకే పరిమితమైంది. ఈ సారి ఎన్నడూ లేని విధంగా వరద రావడంతో హనుమకొండ, కాజీపేట సైతం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాకతీయుల కాలంలో నిర్మించిన గొలుసుకట్టు చెరువులు వరంగల్ నగరానికి చుట్టూ ఉన్నాయి. మడికొండ చెరువు మత్తడి పారి సోమిడి చెరువుకు, అక్కడి నుంచి వడ్డేపల్లి చెరువుకు నీళ్లు వస్తాయి. వరద ఉధృతి ఒక్క సారిగా రావడంతో వడ్డేపల్లి చెరువు మత్తడి పారి గోపాల్ పూర్ చెరువుకు వెళ్లాల్సి ఉంటుంది. నాలాలపై కబ్జాల కారణంగా నీళ్లన్నీ హనుమకొండలోని కాలనీలకు చేరాయి. జోరుగా కురుస్తున్న వరదల ప్రభావం అటు కాజీపేటపైనా పడింది. ఏకంగా రైల్వే ట్రాక్ ను వరద నీరు ముంచెత్తడంతో రైళ్లు రద్దయ్యాయి. ముఖ్యంగా వరంగల్ మహానగరం నీటమునగడానికి కారణాలను గుర్తించిన ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలో తాత్సారం చేసిందని, భద్రకాళీ బండ్ సుందరీకరణపై పెట్టిన శ్రద్ధ తమపై కూడా పెట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని చెబుతున్నారు. 

పట్నం పరేషాన్..

హైదరాబాద్ అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది మూసీ నది. మురికీ నీరంతా మూసీలో చేరడం.. నాలాలన్నీ కబ్జాలకు గురికావడం.. అనుబంధంగా నిజాం నవాబులు నిర్మించిన చెరువులు ఆనవాళ్లు కోల్పోయి కాలనీలుగా మారడం ముంపు సమస్యకు కారణమన్నది నిష్ఠుర సత్యం. వర్షం వచ్చినప్పుడల్లా.. జనం నోళ్లలో బాగా నానేది మూసారం బాగ్ బ్రిడ్జి.. మునిగిందా..? ఇంతకు మునుగుతుందా..? రాకపోకలు ఎట్లా..? పురానా పూల్ దగ్గర పరిస్థితి ఏంది..? ఇదే చర్చ..! మూసీ సుందరీకరణ కోసం ప్రత్యేకంగా 3 వేల కోట్లు వెచ్చించి ఆహ్లాదం పంచేలా చర్యలు తీసుకుంటామని సర్కారు చెబుతూ వచ్చింది. కానీ ఇప్పటి వరకు దీనిపై శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. సబర్మతి నది ప్రక్షాళన స్ఫూర్తితో ముందుకు వెళ్తామని చెప్పిన పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. థేమ్స్ నది మారిరిగా పిల్లలు బోటింగ్ చేసేలా మూసీని తీర్చిదిద్దుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 

అసలు వరద నీరు వెళ్లడమే కష్టంగా మారడం.. మురుగు నీళ్లన్నీ మూసీలోకి వెళ్తుండటం భాగ్యనగరం వాసులకు శాపంగా మారింది. దీనికి తోడు కబ్జాలు పరేషాన్ చేస్తున్నాయి. మూసారం బాగ్ బ్రిడ్జిపైకి నీళ్లొస్తే అంబర్ పేట, దిల్ సుఖ్ నగర్ కు రాకపోకలు బందవుతాయి. కాలనీలు నీటమునుగుతాయి. వరదలు వచ్చినప్పుడు ఛత్రీలు పట్టుకొని, లైఫ్ జాకెట్లు వేసుకొని వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ తర్వాత వేరే పనుల్లో బిజీగా ఉండి తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరదల్లో చిక్కుకున్నప్పుడు ఎన్డీఆర్ఎఫ్​ బృందాలను రంగంలోకి దింపడం, కాలనీలకు పడవలు పంపండం, వరద ఉధృతి ఎక్కువగా ఉన్న చోటికైతే ఏకంగా హెలికాప్టర్లనే పంపడం తర్వాత శాశ్వాత పరిష్కార చర్యలు తీసుకోకపోతుండటంపై జనం శాపనార్థాలు పెడుతున్నారు. తమను ఎవరు పట్టించుకోవాలని కన్నీరుపెట్టుకుంటున్నారు.