భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో భర్తతో విడాకులు... ప్రియుడి మోసం కూతురి తో కలిసి మహిళ సూసైడ్‌‌‌‌‌‌‌‌

 భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో భర్తతో విడాకులు... ప్రియుడి మోసం కూతురి తో కలిసి మహిళ సూసైడ్‌‌‌‌‌‌‌‌
  •     భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఘటన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భర్తతో విడాకులు తీసుకొని తల్లిగారింటి వద్ద ఉంటున్న మహిళను ప్రేమ, పెండ్లి పేరుతో ఓ యువకుడు నమ్మించాడు. చివరకు అతడు మరో యువతితో పెండ్లికి సిద్ధం కావడంతో సదరు మహిళ తన తొమ్మిదేండ్ల కూతురితో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో ఆదివారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తగూడెం నగరంలోని బాబు క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఏరియాకు చెందిన ఆర్.రమ్య (35)కు కొన్నేండ్ల కింద నవీన్‌‌‌‌‌‌‌‌తో వివాహమైంది. వీరికి కూతురు ఆద్య అలియాస్‌‌‌‌‌‌‌‌ చెర్రి (9) ఉంది. 

రమ్య, నవీన్‌‌‌‌‌‌‌‌ మధ్య గొడవలు తలెత్తడంతో కొంతకాలం కింద విడాకులు తీసుకున్నారు. దీంతో రమ్య, తన కూతురు ఆద్యతో కలిసి తల్లిగారింటి వద్ద ఉంటోంది. నవీన్‌‌‌‌‌‌‌‌ అప్పుడప్పుడూ వచ్చి కూతురిని చూసుకొని వెళ్తుండేవాడు. కొన్ని కారణాలతో నవీన్‌‌‌‌‌‌‌‌ ఇటీవలే చనిపోయాడు. రమ్యకు తన ఇంటి సమీపంలో ఉండే సుధాకర్‌‌‌‌‌‌‌‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 

రమ్యను పెండ్లి చేసుకుంటానని, ఆద్యను బాగా చూసుకుంటానని చెప్పడంతో నిజమేనని నమ్మింది. కానీ సుధాకర్ మరో అమ్మాయితో పెండ్లికి సిద్ధపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న రమ్య మనస్తాపంతో గత నెల 28న ఆద్యకు విషం ఇచ్చి, తానూ తాగింది. విషయం తెలుసుకున్న ఆమె తల్లి, సోదరుడు వారిని కొత్తగూడెంలోని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఖమ్మంలోని హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లారు. అక్కడ ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ తీసుకుంటూ శనివారం అర్ధరాత్రి తల్లీకూతురు చనిపోయారు. డిప్రెషన్‌‌‌‌‌‌‌‌కు గురై రమ్య తన కూతురితో పాటు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆమె సోదరుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.