హైదరాబాద్, వెలుగు: సైబర్ నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు అద్దెకు ఇస్తున్న బెంగుళూర్‌కు చెందిన మహిళను సిటీ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పార్ట్ టైమ్ జాబ్ పేరుతో జరుగుతున్న ఇన్వెస్ట్‌మెంట్ మోసాలకు అకౌంట్లు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసిఫ్‌నగర్‌కు చెందిన బాధితుడికి పార్ట్‌టైమ్ జాబ్ పేరుతో వాట్సాప్, టెలిగ్రామ్‌లో లింక్స్ పంపించారు.
విడతల వారీగా రూ. 5.84 లక్షలు వసూలు చేశారు. బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. బాధితుడి డబ్బు డిపాజిట్ అయిన ఖాతాలను గుర్తించారు. చెన్నైకి చెందిన మహిళ అకౌంట్ ఓపెన్ చేసి 10 శాతం కమిషన్‌తో సైబర్ నేరగాళ్లకు అందించినట్లు దర్యాప్తులో తేలింది. ఆ ఖాతాలో రూ.10 లక్షలు డిపాజిట్ అయినట్లు గుర్తించారు. మరికొన్ని కేసులతో కూడా ఈ అకౌంట్ లింక్ ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. నిందితురాలిని బుధవారం అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. గురువారం రిమాండ్ చేశారు.
