- మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు
- సిద్దిపేట జిల్లా మంచినీళ్ల బండ గ్రామంలో దారుణం
హుస్నాబాద్ (అక్కన్నపేట), వెలుగు : ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, మెడలో ఉన్న మూడు తులాల బంగారం తీసుకొని పరార్ అయ్యారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మంచినీళ్లబండ గ్రామంలో గురువారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బోయిని కనకయ్యకు రాజవ్వ (45), రాధవ్వ ఇద్దరు భార్యలు.
గురువారం పనికి వెళ్లిన కనకయ్య రాత్రి ఇంటికి రాకపోగా, అతడి రెండో భార్య రాధవ్వ సైతం పని మీద బయటకు వెళ్లింది. దీంతో రాజవ్వ ఒంటరిగా ఇంట్లో పడుకుంది. కొద్దిసేపటి తర్వాత రాధవ్వ వచ్చి చూడగా.. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో పాటు రాజవ్వ మంచంపై రక్తపు మడుగులో పడి కనిపించింది. గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి రాజవ్వను 108లో హూస్నాబాద్ హాస్పిటల్‌కు, అక్కడి నుంచి సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.
అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ శుక్రవారం చనిపోయింది. సమాచారం అందుకున్న సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్, హుస్నాబాద్ ఏసీపీ సదానందం ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్‌స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి రాజవ్వపై దాడికి పాల్పడి, మెడలోని మూడు తులాల బంగారు పుస్తెలతాడును అపహరించుకొని పోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ హత్య బంగారం కోసమే జరిగిందా ? లేక పాతకక్షలు ఏవైనా ఉన్నాయా ? అనే కోణంలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
