వరంగల్ జిల్లాలో న్యాయం కావాలంటూ పీఎస్ వద్ద ఆత్మ హత్యాయత్నం

 వరంగల్ జిల్లాలో న్యాయం కావాలంటూ పీఎస్ వద్ద ఆత్మ హత్యాయత్నం

వర్ధన్నపేట, వెలుగు: తమకు న్యాయం చేయాలంటూ ఓ మహిళ, తన కుటుంబ సభ్యులు పోలీస్​ స్టేషన్​ వద్ద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. బాధితురాలి వివరాల ప్రకారం.. వరంగల్​ జిల్లా  వర్ధన్నపేట మండలం తాళ్లకుంట తండాకు చెందిన మౌనికకు గుబ్బెటి తండాకు చెందిన సురేశ్​తో వివాహం కాగా వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా సురేశ్​ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను, పిల్లలను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడని మౌనిక ఆరోపించింది.

ఇదే విషయంపై జరిగిన గొడవలో సురేశ్, అతడి తండ్రికి గొడవ జరిగి తండ్రి చనిపోయాడని, జైలుకు వెళ్లి బెయిల్‌‌‌‌‌‌‌‌పై వచ్చిన సురేశ్​ మరింత వేధింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. స్థానిక ఎమ్మెల్యే అండదండలతో పోలీసులపై ఒత్తిడి తెచ్చి తనకు న్యాయం జరగకుండా చేస్తున్నాడని మౌనిక చెప్పింది. న్యాయం కోసం ఎస్సైని ఆశ్రయించగా లంచం అడిగినట్లు ఆరోపించింది. 

ఈ క్రమంలో బుధవారం ఇరువైపుల వారు పోలీస్ స్టేషన్‌‌‌‌‌‌‌‌కు రాగా అక్కడ కూడా సురేశ్​ తనపై దాడి చేశాడని, పోలీసులు చూస్తూ ఉండిపోయారని మౌనిక వాపోయింది. దీంతో మౌనిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. తన పిల్లలను తనకు అప్పగించి సురేశ్​పై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐ శ్రీనివాసరావు కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే తాము లంచం అడిగామన్న ఆరోపణలు అవాస్తవమని ఎస్సై సాయిబాబా తెలిపారు.

పోలీస్​స్టేషన్​ లాకప్​లో వ్యక్తి..

మెహిదీపట్నం, వెలుగు: బైకు దొంగతనం కేసులో అదుపులోకి తీసుకుని పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్ లాకప్​లో ఉంచిన ఓ వ్యక్తి ఒంటికి నిప్పు పెట్టుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన కుల్సుంపుర పోలీస్‌‌‌‌‌‌‌‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ రాములు తెలిపిన ప్రకారం.. జియాగూడ గోపి హోటల్ సమీపంలో నివసిస్తున్న ఇస్తాక్(22) పాన్ షాపులో పనిచేస్తున్నాడు. బైక్ దొంగతనం కేసులో మంగళవారం రాత్రి ఇస్తాక్‌‌‌‌‌‌‌‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని లాకప్​లో ఉంచారు. అర్ధరాత్రి దాటిన తర్వాత బుధవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో బాత్రూంకి వెళ్లి అక్కడ ఉన్న అగ్గిపెట్టెతో ఒంటికి నిప్పు పెట్టుకున్నాడు. 

పోలీసులు వెంటనే అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాత్రూంలోకి అగ్గిపెట్టె ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇస్తాక్‌‌‌‌‌‌‌‌పై నాలుగు దొంగతనం కేసులతో పాటు పోక్సో కేసు కూడా ఉందని సీఐ తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.