
కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ యువతి ఘోర ప్రమాదం నుంచి తప్పించుకుంది. అదే సమయంలో అక్కడున్న లేడీ కానిస్టేబుల్ ఆమెను కాపాడింది. ఈ ఘటన బేగంపేట స్టేషన్‌లో చోటుచేసుకుంది.ఇక వివరాల్లోకి వెళ్తే 2023 మే 30 మంగళవారం రోజున ఉదయం 9 గంటల ప్రాంతంలో లింగంపల్లి- ఫలక్‌నూమా ఎక్స్‌ప్రెస్ బేగంపేట్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది.
అయితే సరస్వతి అనే ఓ ప్రయాణికురాలు ఆ కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించింది. పట్టు తప్పడంతో రైలు వేగంగా ముందుకు కదలడంతో ఆమె ప్లాట్‌ఫాం, రైలు మధ్య పడబోయింది. అదే సమయంలో అక్కడ విధులు నిర్వహిస్తున్న సనిత అనే 'రైల్వే ప్రొటెక్క్షన్ ఫోర్స్' (ఆర్పీఎఫ్) కానిస్టేబుల్ ఆమెను గమనించి వెంటనే సరస్వతిని వెనక్కి లాగింది. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.
కానిస్టేబుల్ సనితపై రైల్వే అధికారులు, నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నల్లగొండకు చెందిన కే సనిత 2020లో ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌గా ఎంపికైంది. ప్రస్తుతం బేగంపేట రైల్వే స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తుంది.
ట్రైన్ మిస్ అవుతుందని కొందరు ఇలా కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఒక ట్రైన్ మిస్ అయితే ఇంకో ట్రైన్ ఎక్కవచ్చు. కానీ ప్రాణాలు పోతే తిరిగి తీసుకురాలేం. ట్రైన్ టైమ్ కు రైల్వేస్టేషన్ కు చేరుకోవాలని మిస్ అయితే మరో ట్రైన్ చూసుకోవాలి కానీ ఇలాంటి రిస్క్ లు చేయకూడదని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.