సీరియల్స్ లో చాన్స్ ఇప్పిస్తానంటూ మోసం

సీరియల్స్ లో చాన్స్ ఇప్పిస్తానంటూ మోసం

ఫేస్ బుక్ లో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి సీరియల్స్ లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసాలకు పాల్పడుతున్న మహిళ ను శనివారం రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ప్రముఖ ఛానల్ లో  ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ గా చెప్పుకుంటూ ఆర్టిస్ట్ ల నుంచి డబ్బులు వసూలు చేసిన నిందితురాలి కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ మహేశ్​భగవత్ వెల్లడించారు.

ఇదీ మాయలేడి స్కెచ్…

చిత్తూరు జిల్లా వాయల్ పాడుకు చెందిన వై.శ్రీలత అలియాస్ శ్రీదేవి అలియాస్ సుస్మిత(33) బెంగుళూరులోని హోస్ కోట్ అత్తూర్ లో ఉంటోంది. శ్రీలత  ఓ ప్రముఖ చానల్ (ఈటీవీ) లో ప్రసారం అయ్యే తెలుగు సీరియల్స్ ఎక్కువగా చూసేది. అందులోని నటించే ఆర్టిస్ట్ లు నిషమా, శిరీష, కరుణ తదితరులను చూసిన శ్రీలత ఓ స్కెచ్ వేసింది. ఆర్టిస్ట్ ల పేరుతో ఎలాగైన డబ్బు సంపాదించాలని  పథకం రచించింది. గతేడాది  జులైలో ఆ చానెల్ లో ఓ సీరియల్ చూస్తున్న సమయంలో ప్రొడ్యూసర్ ‘శ్రీదేవి తుమ్మల‘ అనే పేరును శ్రీలత గమనించింది. టీవీ ఆర్టిస్టుల్లో శ్రీదేవి తుమ్మలకు మంచి పేరుంది. దీంతో తన ప్లాన్ అమలు చేసేందుకు ఆమె పేరును ఉపయోగించుకోవాలని శ్రీలత స్కెచ్ వేసింది. ఇందుకోసం ఫేస్ బుక్ లో ‘శ్రీదేవి తుమ్మల’ పేరుతో  ఓ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసింది. దీంతో టీవీ ఆర్టిస్టులు కావాలనుకునే వారిని టార్గెట్ చేసింది.ఇందులో భాగంగా  నిషమా,శిరీష,కరుణతో  పాటు మరికొందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ఫ్రెండ్ రిక్వెస్ట్ చూసి టీవీ,మూవీ ఆర్టిస్టులు శ్రీలతతో ఫేస్ బుక్ పరిచయం పెంచుకున్నారు. దీంతో  టీవీ ఆర్టిస్టులు కావాలనే కోరిక ఉన్న వారికి అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి శ్రీలత వారి దగ్గరి నుంచి  డబ్బులు వసూలు చేసింది. ఇలా తన ట్రాప్ లో పడ్డ వంశీ అనే యువకునికి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని నమ్మించింది.  వంశీ నుంచి శ్రీలత రూ.50వేలు వసూలు చేసింది. ఇండియన్ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు డిపాజిట్ చేయించింది.

అమ్మాయిల ఫొటోలతో ట్రాప్…

మణికొండలో ఉండే క్రాంతికుమార్ కి శ్రీలత ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించింది. తన చాటింగ్ తో క్రాంతికుమార్ ను ట్రాప్ చేసింది. అందమైన యువతుల ఫొటోలు ఫేస్ బుక్ లో షేర్ చేసి ఆకట్టుకుంది. తనను పూర్తిగా నమ్మిన క్రాంతికుమార్ దగ్గరి నుంచి శ్రీలత రూ.6 లక్షలు వసూలు చేసింది. ఇండియన్ బ్యాంక్ అకౌంట్ లో ఆ డబ్బును డిపాజిట్ చేయించుకుంది. ఇలా శ్రీదేవి తుమ్మల పేరుతో మోసాలకు పాల్పడుతున్న శ్రీలత విషయం బాధితుల ద్వారా సదరు చానెల్ కు తెలిసింది.

శ్రీలత క్రియేట్ చేసిన ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ తో తమ సంస్థ ప్రతిష్ట దెబ్బతింటోందని చానెల్ యజమాన్యం  రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లయింట్ చేసింది. కేసు దర్యాప్తు చేసిన సైబర్ క్రైమ్ ఇన్ స్పెక్టర్ ఏవీ. రంగ టీమ్ శనివారం శ్రీలతను అరెస్ట్ చేసింది. నిందితురాలు శ్రీలత 2017లో మ్యాట్రిమోనియల్ మోసాలు చేసి సైబరాబాద్ పోలీసులకు చిక్కినట్లు గుర్తించారు. శ్రీలత దగ్గరి నుంచి మొబైల్ ఫోన్ రెండు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.