వైజాగ్ లో కరోనాతో మహిళ మృతి

వైజాగ్ లో కరోనాతో మహిళ మృతి

కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్ 1 దేశంలో తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్న వేళ.. తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు, మరణాలు సంభవించడం మరింత భయాన్ని రేకెత్తిస్తోంది. తాజాగా విశాఖపట్నంలోని కింగ్ జార్జ్ ఆసుపత్రిలో చేరిన ఓ 51ఏళ్ల మహిళకు నిర్వహించిన పరీక్షల్లో కొవిడ్ -19 పాజిటివ్ గా తేలింది. ఆ తర్వాత పరిస్థితి విషమించడంతో రోగి ఆమె మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

కొత్త సబ్‌వేరియంట్ JN.1 పెరుగుదల మొదలైన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన మొదటి కేసు ఇదే. వైజాగ్ లోని కంచరపాలెంకు చెందిన బాధితురాలు మొదట ఛాతీ నొప్పి, అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ARDS) తో డిసెంబర్ 22 న పెద వాల్తేర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. ఆ తరువాత ఆమెకు కొవిడ్-19 ఉన్నట్లు పరీక్షల్లో నిర్థారణ కావడంతో ఆమెకు మెరుగైన చికిత్స కోసం కేజీహెచ్ కి తరలించారు. అంతలోనే ఆమె పరిస్థితి విషమించడంతో ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం రోగి పాజిటివ్ సాంపిల్స్ ను పంపించారు.

మహమ్మారి కంటే ముందే రోగి కిడ్నీ ఫెయిల్యూర్‌తో పోరాడుతోందని, కొవిడ్-19 కంటే ఆమె తన తీవ్రమైన కొమొర్బిడిటీలతో మరణించడం వల్ల దీన్ని మహమ్మారి వల్ల సంభవించిన మరణంగా పరిగణించలేమని అని KGH సూపరింటెండెంట్ డాక్టర్ P అశోక్ కుమార్ చెప్పారు. చివరి దశలో కిడ్నీ ఫెయిల్యూర్‌తో సహా రోగికి డిస్‌ఫంక్షన్ సిండ్రోమ్ వల్ల తాము ఎంత ప్రయత్నించినప్పటికీ, రోగిని రక్షించలేకపోయామన్నారు. అంతకుముందు కొవిడ్-19 పరిస్థితిని సమీక్షించేందుకు కలెక్టర్ డాక్టర్ ఎ మల్లికార్జున సమావేశం నిర్వహించారు. జిల్లాలో గడిచిన వారం రోజుల్లో 20 కొత్త కేసులు నమోదయ్యాయని, భవిష్యత్‌లో ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొనేందుకు మాక్‌ డ్రిల్‌ నిర్వహించాలని అధికారులను కలెక్టర్‌ కోరారు.