8 ఏండ్లప్పడు తప్పిపోయి..  37 ఏండ్లకు ఇంటికి చేరింది

8 ఏండ్లప్పడు తప్పిపోయి..  37 ఏండ్లకు ఇంటికి చేరింది

వనపర్తి, వెలుగు: ఎనిమిదేండ్ల వయస్సులో తప్పిపోయిన బాలిక 37 ఏండ్ల వయస్సులో తండ్రి, తమ్ముళ్లను చేరింది. అప్పటికే తల్లి మరణించిందని తెలిసి కన్నీరు పెట్టుకుంది. సోషల్​మీడియా ద్వారా పుట్టింటి ఆచూకీ కనిపెట్టి 30 ఏండ్లుగా అత్త అనుభవిస్తున్న బాధను దూరం చేశాడు ఆమె అల్లుడు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం నెల్విడి గ్రామానికి చెందిన మంగమ్మ కథ ఇది. నెల్విడికి చెందిన క్యాసాని నాగన్న, తారకమ్మ దంపతులకు సత్యమ్మ, నాగేశ్వరమ్మ, మంగమ్మ అనే కూతుళ్లతోపాటు వెంకటేష్, కృష్ణ అనే కొడుకులు ఉన్నారు. వీరికి గ్రామంలో కొద్దిగా పొలం ఉంది. తీవ్రమైన కరువు కారణంగా నాగన్న కుటుంబం1985లో హైదరాబాద్​కు వలస వెళ్లింది. ఆ టైంలో మంగమ్మ(8)ను తెలిసిన వారి ఇంటి వద్ద ఉంచి పనులకు వెళ్లగా తిరిగి వచ్చేసరికి తప్పిపోయింది. ఎంత వెతికినా ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబం తిరిగి సొంతూరికి వచ్చేసింది. కాగా ఓ వృద్ధుడు మంగమ్మను గుంటూరు జిల్లా వేమూరు మండలం జంపని గ్రామానికి తీసుకెళ్లి ఓ చర్చి వద్ద వదిలిపెట్టాడు. చర్చి వద్ద ఏడుస్తూ కూర్చున్న పాపను కనగల చిన్న సామెలు అనే వ్యక్తి చేరదీసి తన పిల్లలతోపాటు మంగమ్మను పెంచి కొల్లిపర మండలం దావులూరు గ్రామానికి చెందిన అంబటి దాసుతో వివాహం చేశాడు. వీరికి శాంతకుమారి, వసంతకుమారి అనే ఇద్దరు పిల్లలున్నారు.

2019లో పెద్ద కూతురు శాంతకుమారిని అమృతలూరు మండలం యాలవరుకి చెందిన క్రిస్టోఫర్ తో పెండ్లి చేశారు. ఏండ్లు గడిచిపోతున్నా మంగమ్మ మనసులో ఒక్కసారైనా తల్లిదండ్రులు, తోబుట్టువులను చూడాలనే కోరిక అలానే ఉంది. తాను చనిపోయేలోగా అది నెరవేరుతుందో లేదోనని తరచూ బాధపడుతూ ఉండేది. మంగమ్మ భర్త, కూతుళ్లు, అల్లుడితో తన తల్లిదండ్రుల పేర్లు, అక్క, సోదరుల పేరు, ఊరు చెబుతూ ఉండేది. ఆ వివరాల ఆధారంగా మంగమ్మ అల్లుడు క్రిస్టోఫర్ ఫేస్​బుక్​ద్వారా అత్త కుటుంబ సభ్యుల ఆచూకీ కోసం వెతికాడు. చివరికి నెల్విడికి చెందిన భాస్కర్ నాయక్ తో ఫేస్ బుక్ పరిచయం ద్వారా ఆచూకీ తెలుసుకున్నాడు. ఆమె సోదరులు వెంకటేష్, కృష్ణలకు చెప్పడంతో వారు వెళ్లి మంగమ్మతో పాటు భర్త దాసును సోమవారం నెల్విడికి తీసుకొచ్చారు. తల్లి తారకమ్మ చనిపోయిందని తెలుసుకుని మంగమ్మ కన్నీరుపెట్టుకుంది. తండ్రిని చూడగానే మంగమ్మ భావోద్వేగానికి గురైంది.