క్రైమ్ ట్రైనింగ్ కోసం వెళ్లిన మహిళా ఎస్ఐ ఆత్మహత్య

క్రైమ్ ట్రైనింగ్ కోసం వెళ్లిన మహిళా ఎస్ఐ ఆత్మహత్య

విజయనగరం: డిపార్టుమెంటల్ ట్రైనింగ్ లో భాగంగా క్రైమ్ ట్రైనింగ్ కోసం వెళ్లిన మహిళా ఎస్సై ఆత్మహత్యకు పాల్పడింది. నిన్న శనివారం శిక్షణ పూర్తి చేసుకున్న ఆమె ఆదివారం తిరిగి రావాల్సి ఉండగా.. ఏం జరిగిందో గాని గదిలో ఫ్యాన్ కు వేలాడుతూ విగతజీవిగా కనిపించింది. పోలీసు శాఖకు చెందిన మహిళా ఎస్.ఐ, అవివాహితురాలైన కె.భవాని (25) ఆత్మహత్య చేసుకున్న ఉదంతం ఏపీ పోలీసు శాఖలో కలకలం రేపింది. 
సఖినేటిపల్లి మహిళా పోలీసు స్టేషన్ లో అడిషనల్ ఎస్సై గా పనిచేస్తున్న కె.భవాని విజయనగరంలో శనివారం రాత్రి తన గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వారం రోజుల క్రితం విజయనగరం జిల్లా లో పి టి సి ట్రైనింగ్ సెంటర్లో క్రైమ్ శిక్షణ నిమిత్తం వెళ్లింది. 2018 బ్యాచ్ కి చెందిన ఎస్సై భవానీ తూర్పు గోదావరి జిల్లా రాజోలు స్టేషన్ లో ట్రైనింగ్ అనంతరం సఖినేటిపల్లి పీఎస్ లో మొదటి పోస్టింగ్ తీసుకుంది. అవివాహిత అయినా భవానీ స్వస్థలం కృష్ణా జిల్లా కోడూరు మండలం సాలెం పాలెం గ్రామం.
వారం రోజుల క్రితం విజయనగరం పోలీసు ట్రైనింగ్ కాలేజీలో క్రైమ్ శిక్షణకు వెళ్లిన భవాని శనివారం మధ్యహ్నానికి శిక్షణ పూర్తి చేసుకుంది. ఆదివారం ఆమె తిరిగి రావాల్సి ఉంది. శిక్షణ పూర్తయిన వెంటనే విశాఖపట్టణంలో ఉంటున్న ఆమె సోదరుడు శివకు చివరిసారి ఫోన్ చేసి మాట్లాడింది. ట్రైనింగ్ పూర్తయిందని చెప్పి పెట్టేసింది. ఆదివారం తిరిగొస్తుందని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులకు ఆమె మరణవార్త తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయనగరం డీఎస్పీ అనిల్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో ఆధారాలు సేకరించారు. విజయనగరం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.