
- యూపీలో దారుణం
లక్నో: కుటుంబ గొడవలు పిల్లల ప్రాణాల మీదకు తెచ్చాయి. భార్యాభర్తల గొడవ బిడ్డల్ని కడతేర్చేందుకు పురికొల్పింది. కట్టుకున్న భర్తపై కోపంతో భార్య తన ఐదుగురు పిల్లలను గంగా నదిలో విసిరేసిన దారుణ ఘటన యూపీలోని గోపీగంజ్ పీఎస్ పరిధిలో శనివారం రాత్రి జరిగింది. ఘటన వివరాలు పోలీస్ సూపరింటెండెంట్ రామ్ బదన్ సింగ్ ఆదివారం మీడియాకు వెల్లడించారు. ఏడాది నుంచి మంజు యాదవ్, ఆమె భర్త మృదుల్ యాదవ్ తరచూ గొడవ పడుతున్నారని, శనివారం రాత్రి తన భర్తతో గొడవ తర్వాత మంజు యాదవ్ తన పిల్లలు ఆర్తి, సరస్వతి, మాతేశ్వరి, శివశంకర్, కేశవ్ ప్రసాద్లను నదిలో విసిరిందని చెప్పారు. పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. పిల్లలతో కలిసి ఆమె రాత్రిపూట ఒడ్డు దగ్గరకు వచ్చినప్పుడు చూశామని, మంత్రగత్తె అయ్యుంటదని వెళ్లిపోయామని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. తెల్లవారేసరికి ఆమె ఒంటరిగా అక్కడే కనిపించేసరికి అడగడంతో విషయం బయటపడిందని చెప్తున్నారు.