నడుచుకుంటూ వెళ్తూ..రోడ్డు పక్కన డెలివరీ

నడుచుకుంటూ వెళ్తూ..రోడ్డు పక్కన డెలివరీ

రామాయంపేట, వెలుగు: చత్తీస్​గఢ్​నుంచి పొట్టచేతబట్టుకుని వచ్చారు ఆ దంపతులు. 45 రోజులుగా పని లేదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. తినడానికి బువ్వ లేదు.. పస్తులతోనే పొద్దుగడుపుతున్నారు. పరిస్థితి ఇట్లనే ఉంటే కడుపులోని బిడ్డకు ఏమైతదోనని భయపడ్డారు.. కష్టమో, నష్టమో.. చస్తమో, బతుకుతమో.. సొంతూరికి వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారు. తోటి వాళ్లతో కలిసి నడుచుకుంటూ ఊరి తొవ్వ పట్టారు.. సిటీ దాటి కొంత దూరం వెళ్లారో లేదో.. నెలలు నిండినయ్ కదా గర్భిణి కడుపులో నొప్పి మొదలైంది.. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.. పక్కనే ఉన్న తోటి కూలీలు సాయం చేశారు. పక్కనే ఉన్న చెట్టు కిందికి తీసుకెళ్లారు.. ఆమెకు సపర్యలు చేశారు.. కొద్దిసేపటికి బంగారుతల్లి బయటికొచ్చింది. మంగళవారం మెదక్ జిల్లా నార్సింగి మండలం జప్తిశివునూరు వద్ద నేషనల్ హైవేపై జరిగిందీ ఘటన.

చత్తీస్​గఢ్​లోని రాజనంద్​గావ్ జిల్లా దోంగర్​గఢ్ మండలం కల్లారి గ్రామానికి చెందిన అనితాబాయ్, లోకేశ్ దంపతులు, మరో ఆరుగురు రెండేళ్ల కిందట బతుకుదెరువుకు హైదరాబాద్ వచ్చారు. కూకట్​పల్లి హౌసింగ్ బోర్డులో ఉంటూ నిర్మాణ పనులు చేస్తున్నారు. లాక్​డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి. దీంతో సొంతూరికి వెళ్లేందుకు సోమవారం రాత్రి కాలినడకన బయలుదేరారు. నార్సింగి వరకు వారికి లారీ దొరికింది.  అక్కడి నుంచి మళ్లీ కాలినడకన బయలుదేరారు. అయితే జప్తి శివనూర్ సమీపంలోకి వచ్చే సరికి అనితా బాయ్​కి పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమెను భర్త, మిగతావాళ్లు కలిసి రోడ్డుపక్కన చెట్టుకిందకు చేర్చారు. కొద్దిసేపటి తర్వాత అనిత ఆడబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న ఎస్సై రాజేశ్.. తల్లీబిడ్డలను అంబులెన్స్ లో రామాయంపేట ఆస్పపత్రికి తరలించారు. వారిద్దరూ క్షేమంగా ఉన్నారు.