11శాతం మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు

11శాతం మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు

కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ భారతదేశంలో పురుషులు, మహిళల – 2020 పేరుతో నివేదికను విడుదల చేసింది. దేశంలో మొత్తం 4,235 అసెంబ్లీ స్థానాలుంటే కేవలం 11శాతం(476) మాత్రమే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది ఏపీలో 8శాతం, తెలంగాణలో 5శాతంతో  జాతీయ సగటు కంటే తక్కువగా ఉండటం గమనార్హం. అత్యధికంగా పుదిచ్చేరి శాసనసభలో 32శాతం మహిళలున్నారు. 1995లో ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గంలో 11.54శాతం ఉండగా, ఈ సంఖ్య 2020 నాటికి 9.26శాతానికి తగ్గింది.  సుప్రీంకోర్టులో 7శాతం, ఏపీ హైకోర్టులో 15శాతం, తెలంగాణ హైకోర్టులో 7శాతం మహిళా న్యాయమూర్తులున్నారు. అత్యధికంగా సిక్కిం హైకోర్టులో 33శాతం, ఢిల్లీ హైకోర్టులో 23శాతం మహిళా న్యాయమూర్తులున్నారు. 

2011–17 మధ్యకాలంలో జాతీయ అక్షరాస్యత 73 నుంచి 77.7శాతానికి పెరిగింది. జాతీయ స్థాయిలో 2017 నాటికి సగటు అక్షరాస్యత మహిళల్లో 70.3శాతం, కాగా పురుషుల్లో 84.7శాతం ఉన్నారు.  తెలంగాణలో పురుషుల కంటే మహిళల్లో అక్షరాస్యత గ్రామాల్లో 16.9శాతం, పట్టణాల్లో 12శాతం తక్కువ.  దేశంలో 15–24 ఏళ్ల వయస్సు వారిలో అత్యధికంగా కేరళల 99శాతం వంతున యువతీ యువకులు అక్షరాస్యత సాధించారు. తెలంగాణ యువ అక్షరాస్యతలో 90.8శాతం పురుషులు, 83.2శాతం మహిళలున్నారు. దేశంలో 2018–19లో రోజు కూలీ (జాతీయ సగటు) పట్టణాల్లో పురుషులకు రూ.342, మహిళలకు రూ.205, గ్రామాల్లో పురుషులకు రూ.277, మహిళలకు రూ.170 లభించింది. తెలంగాణలోని పట్టణాల్లో 52.6శాతం పురుషులు, 16.1శాతం మహిళలు, గ్రామీణ ప్రాంతాల్లో 51.5శాతం పరుషులు, 36.9శాతం మహిళలు ఉన్నారు.