బీఆర్ఎస్​ లీడర్లు మా ఊరికొస్తే చీపుర్లు పట్టి తరిమికొడతం: మహిళలు

బీఆర్ఎస్​ లీడర్లు మా ఊరికొస్తే చీపుర్లు పట్టి తరిమికొడతం: మహిళలు

కొండపాక, వెలుగు : సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని పలు గ్రామాల్లో ప్రచారానికి వచ్చిన ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, చిట్టి దేవేందర్ రెడ్డిలకు ప్రజల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. గురువారం బందారం, అంకిరెడ్డిపల్లి , మర్పడగ గ్రామాల్లో వారు ప్రచారం చేశారు. బందారం సభలో వంటేరు మాట్లాడుతుండగా పలువురు మహిళలు అడ్డుకున్నారు. పదేండ్లలో తమ ఊరికి ఏం చేశారని ప్రశ్నించారు. తపాస్ పల్లి రిజర్వాయర్ నుంచి కాల్వ నిర్మించాలని కోరినా పట్టించుకోలేదన్నారు.

దీంతో సాగునీరందక పంటలు ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లు లేని వారికి డబుల్ బెడ్ రూమ్ లు ఎందుకివ్వలేదని అడిగారు. పిల్లలకు ఉద్యోగాలు కూడా రాలేదన్నారు. దీంతో ప్రతాపరెడ్డి ప్రసంగం ఆపేసి మహిళల దగ్గరకు వచ్చారు. 

‘ మీకు బుద్ది లేదా..అప్పటి నుంచి చూస్తున్నా...అరుస్తున్నరు..సిగ్గు లేదా’ అని దురుసుగా మాట్లాడుతూ నెట్టుకుంటూ పక్క గ్రామానికి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మహిళలంతా ఆగ్రహంతో చీపుర్లు పట్టుకుని  బీఆర్ఎస్ లీడర్లెవరూ తమ ఊరికి రావొద్దని వస్తే తరిమికొడతామని హెచ్చరించారు. వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఊరుకునేది లేదన్నారు.