రాష్ట్రంలో మహిళలు రోడ్లపై తిరిగే స్వేచ్ఛ లేదు

రాష్ట్రంలో మహిళలు రోడ్లపై తిరిగే స్వేచ్ఛ లేదు

నారాయణపేట, వెలుగు: స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా.. ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ, గౌరవం లేదని వైఎస్సార్​టీపీ చీఫ్ షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానం యాత్ర 123వ రోజు ఆదివారం నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద నుంచి నారాయణపేట వరకు సాగింది. దామరగిద్ద క్యాంప్​ వద్ద షర్మిల జాతీయజెండా ఆవిష్కరించారు. తర్వాత పాదయాత్ర ప్రారంభించి సాయంత్రం నారాయణపేటకు చేరుకున్నారు. అక్కడ నిర్వహించిన సభలో ఆమె మాట్లాడారు. కోట్ల మంది ఉద్యమించి, త్యాగాలు చేస్తేనే దేశానికి స్వాతంత్రం వచ్చిందన్నారు. అలాగే కోట్ల మంది ఉద్యమం, త్యాగాలతోనే తెలంగాణ సాధ్యమైందన్నారు. రాష్ట్రంలో మహిళలు రోడ్లపై తిరిగే స్వేచ్ఛ లేదని, బాలికలపై రేప్​లు జరుగుతుంటే రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. మరియమ్మను జైల్లో పెట్టి చంపేశారన్నారు. చంటిబిడ్డల తల్లులు, మహిళలు అని చూడకుండా జైల్లో పెడుతున్నారని, ఈ ప్రభుత్వానికి మహిళలపై  గౌరవం లేదని మండిపడ్డారు.

నాగరాజుకు రూ.4 లక్షల సాయం   

రాష్ట్ర ఉద్యమంలో 2011 రైల్ రోకో సందర్భంగా కాళ్లు, చేతులు పోగొట్టుకున్న హుజూర్​నగర్​ ఉద్యమకారుడు నాగరాజుకు.. షర్మిల రూ.4 లక్షల ఆర్థిక సాయం అందించారు. ప్రభుత్వం తనకు ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదని రెండ్రోజుల కింద అతను ప్రగతిభవన్ వద్ద ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటనను వీ6, వెలుగు పేపర్ చూసి తెలుసుకున్న షర్మిల అతన్ని నారాయణపేట సభకు పిలిపించుకొని సాయం చేశారు. ఉద్యమంలో అమరులైన, కాళ్లు, చేతులు పోగొట్టుకున్నోళ్ల  కుటుంబాలకు వైఎస్సార్ టీపీ అండగా ఉంటుందన్నారు. నాగరాజు మాట్లాడుతూ అమరుల కుటుంబాలు, ఉద్యమకారులకు టీఆర్​ఎస్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందన్నారు. కేసీఆర్ తనకు ప్రభుత్వ ఉద్యోగం, 5 ఎకరాల పొలం, 70 లక్షల ఆర్థిక సాయం చేస్తానని చెప్పి మరిచిండన్నారు.