బావా చచ్చిపోతున్న.. నీకూ నాకూ రుణం తీరిపోయింది

బావా చచ్చిపోతున్న.. నీకూ నాకూ రుణం తీరిపోయింది


చెరువులో దూకి తల్లీ కూతుళ్ల ఆత్మహత్య

జడ్చర్ల, వెలుగు: అత్తింటి వేధింపులు తట్టుకోలేక మహబూబ్​నగర్ జిల్లాకు చెందిన వివాహిత బిడ్డతోపాటు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల తర్వాత డెడ్​బాడీలు నీటిపై తేలడంతో ఈ విషయం బయటపడింది. తిమ్మాజిపేట మండలం గుమ్మకొండ గ్రామానికి చెందిన ఎల్లమ్మ, సంగయ్య దంపతుల ఒక్కగానొక్క కూతురు సరిత(20). ఆమెను మిడ్జిల్​ మండల కేంద్రానికి చెందిన మేనబావ ఎత్తరి శ్రీశైలం(25)కు ఇచ్చి రెండేళ్ల కింద పెళ్లి చేశారు. వీరి కూతురు భూమిక(9నెలలు). అదనపు కట్నం కావాలంటూ  అత్త రాములమ్మ కొంతకాలంగా సరితను వేధిస్టోంది. డైలీ కూలి పైసల లెక్క చెప్పాలని గొడవకు దిగుతోంది. ఆ విషయాన్ని సరిత తన భర్త శ్రీశైలానికి చెప్పగా పట్టించుకోకపోగా తల్లికే  సపోర్టు చేశాడు. దాంతో జీవితం మీద విరక్తి చెందిన ఆమె మంగళవారం మధ్యాహ్నం బిడ్డతోపాటు ఇంటి నుంచి వెళ్లిపోయింది. కూతురు భూమికను నడుముకు చుట్టుకుని గ్రామ సమీపంలోని మేలకుంట చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. గురువారం ఉదయం చెరువులోని నీటిపై డెడ్​బాడీలు తేలడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. బయటికి తీయించగా బిడ్డను నడుముకు చుట్టుకుని సరిత చనిపోయినట్లు గుర్తించారు. డెడ్​బాడీ వద్ద దొరికిన సూసైడ్​లెటర్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి తల్లిదండ్రులు, సూసైడ్​ నోట్​ఆధారంగా సరిత భర్త, అత్త,మామలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై జయప్రసాద్​ తెలిపారు.  

సూసైడ్​ లెటర్​లో..
‘‘బావ.. నీకూ నాకూ రుణం తీరిపోయింది. నువ్వు, మీ అమ్మ, చెల్లి సంతోషంగా ఉండండి. నేను చనిపోయాక మరో అమ్మాయిని పెళ్లి చేసుకో. నన్ను, మన బిడ్డని మర్చిపో. నా పాడె, దినాలకు అయ్యే ఖర్చుకు నా కూలి పైసలనే వాడు.’’ అంటూ సూసైడ్​ లెటర్​లో పేర్కొంది.