చోరీ కేసులో ఏడాది తర్వాత విచారణకు పిలుపు .. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

చోరీ కేసులో ఏడాది తర్వాత విచారణకు పిలుపు .. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
  •     నాగర్​కర్నూల్ ​జిల్లా కొల్లాపూర్​లో ఘటన 
  •     తప్పుడు కేసు పెట్టిన యాజమాన్యం, పోలీసులే కారణమన్న సోదరి 
  •     తమకు సంబంధం లేదన్న డీఎస్పీ

కొల్లాపూర్, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్​లో ఓ మహిళపై గత ఏడాది దొంగతనం నేరం మోపగా అప్పుడే విచారణ జరిపిన పోలీసులు...మళ్లీ ఇప్పుడు ఎంక్వైరీ రావాలని పిలవడంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం...కొల్లాపూర్​కు చెందిన లక్ష్మి(28) గత ఏడాది పట్టణంలోని సాయికృప ప్రైవేట్​హాస్పిటల్​లోని మెడికల్​ షాపులో పని చేసింది. అప్పుడు మెడికల్​షాపులో డబ్బులు పోయాయంటూ దవాఖాన యాజమాన్యం లక్ష్మిపై చోరీ కేసు పెట్టింది.

 దీంతో కొల్లాపూర్ ​పోలీసులు ఆమెను అప్పట్లోనే రెండు మూడు సార్లు పోలీస్​స్టేషన్​కు పిలిపించి విచారించారు. తనకు ఏ పాపం తెలియదని, దొంగతనం చేయలేదని చెప్పడంతో మళ్లీ పిలవలేదు. దీంతో ఊర్లో పరువు పోయిందని లక్ష్మి భర్త, పాపతో కలిసి చిన్నంబావి మండలం వెల్టూరు గ్రామానికి వెళ్లిపోయింది. గురువారం కొల్లాపూర్ ​పోలీసులు లక్ష్మికి మళ్లీ ఫోన్​ చేశారు. దొంగతనం కేసులో నోటీసు తీసుకోవడానికి పోలీస్​స్టేషన్​కు రావాలని పిలిచారు.

 దీంతో ఊరు మారినా తనను వదిలిపెట్టడం లేదనే మనస్తాపంతో బయట ఎక్కడో పురుగుల మందు తాగింది.  తర్వాత పోలీస్ స్టేషన్​కు వచ్చి కింద పడిపోయింది. దీంతో పోలీసులు ఫిట్స్​వచ్చిందనుకుని దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయింది. ఈ ఘటనపై మృతురాలి అక్క మాట్లాడుతూ హాస్పిటల్​ యాజమాన్యం తప్పుడు కేసు పెట్టిందని, పోలీసులు ఏడాదిగా విచారణ పేరిట ఇబ్బందులు పెడుతుండడంతో తన చెల్లెలు ఆత్మహత్య చేసుకుందన్నారు.

 బాధ్యులైన ఇద్దరు ఎస్​ఐలు, కానిస్టేబుల్​ను సస్పెండ్​ చేయాలన్నారు. సీఐ మహేశ్​ను వివరణ కోరగా ‘దొంగతనం కేసులో లక్ష్మిని విచారణకు పిలిచి ఉండొచ్చు...పిలవకపోవచ్చు’ అని పొంతన లేని సమాధానమిచ్చారు. బహుశా..కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగి ఉండవచ్చన్నారు. 

అవును విచారణకు పిలిచాం : డీఎస్పీ 

గత ఏడాది జరిగిన దొంగతనం కేసులో లక్ష్మిని ఎస్ఐ విచారణకు పిలిచారని డీఎస్పీ శ్రీనివాస్​యాదవ్​ తెలిపారు. కానీ, లక్ష్మి ఇంట్లో భర్తతో  గొడవ కారణంగా అప్పటికే పురుగుల మందు తాగి పీఎస్​కు వచ్చిందన్నారు. ఆమెను కాపాడడానికి శాయశక్తులా ప్రయత్నించామని, కానీ ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆమె మరణానికి, తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు.