
హైదరాబాద్, వెలుగు: భారతీయ కంపెనీల్లో పెద్ద పోస్టుల్లో మహిళల సంఖ్య భారీగా పెరిగింది. తొలిసారిగా నాయకత్వ స్థానాల్లో మహిళల ప్రాతినిధ్యం 20 శాతానికి చేరుకుంది. అవతార్, సీరామౌంట్ సంయుక్తంగా నిర్వహించిన 10వ ఎడిషన్ బెస్ట్ కంపెనీస్ ఫర్ ఉమెన్ ఇన్ ఇండియా స్టడీలో ఈ విషయం వెల్లడైంది. మహిళా ఉద్యోగుల శాతం 35.7 శాతం వద్ద స్థిరంగా ఉంది. మహిళల ప్రాతినిధ్యంలో ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగం (44.6 శాతం), ఐటీఈఎస్ రంగం (41.7 శాతం) ముందు వరుసలో ఉన్నాయి.
ఉద్యోగాన్ని వదిలేసే విషయంలో మహిళలు, పురుషుల రేటు దాదాపు 20 శాతం వద్ద సమానంగా ఉంది. మంచి ఉద్యోగ అవకాశాల కోసమే ఉద్యోగాలను వదులుకుంటున్నారు. ఆరోగ్య సమస్యలు, పిల్లల బాధ్యతల వల్ల కూడా మహిళలు ఉద్యోగాలకు దూరమవుతున్నారు.
అవతార్ ఫౌండర్ డాక్టర్ సౌందర్య రాజేష్ మాట్లాడుతూ... 2016లో 13 శాతం ఉన్న మహిళల ప్రాతినిధ్యం ఈసారి 20 శాతానికి చేరడం గర్వకారణం అన్నారు.