
- ప్రియుడి మోజులో జంట హత్యలు.. 2 నెలల కింద భర్త, ఇప్పుడు కూతురిని చంపేసింది.. భూపాలపల్లి జిల్లాలో ఘటన
- తండ్రి మృతిపై అనుమానంతో నిలదీసిన కూతురు
- ప్రియుడితో కలిసి బిడ్డనూ చంపేసి క్షుద్రపూజల డ్రామా
- పోలీసుల విచారణలో నేరం అంగీకారం.. నిందితుల అరెస్ట్
- భూపాలపల్లి జిల్లాలో ఘటన
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: ప్రియుడి మోజులో పడి రెండు నెలల కింద భర్తను హత్య చేసింది. ఈ విషయం 22 ఏండ్ల కూతురికి తెలియడంతో ఆమెను కూడా చంపేసి డెడ్‌బాడీని హైవే పక్కన పడేసింది. చివరికి పోలీసుల విచారణలో జంట హత్యల విషయం బయటపడింది. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితెల గ్రామంలో చోటు చేసుకున్నది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ కిరణ్ ఖరే బుధవారం (సెప్టెంబర్ 03) మీడియాకు వెల్లడించారు.
ఆగస్టు 28న కమలాపూర్ క్రాస్ రోడ్డు వద్ద హైవే పక్కన ఓ గుర్తుతెలియని యువతి డెడ్‌బాడీ దొరికింది. మృతదేహం వద్ద క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. విచారణ అనంతరం మృతురాలిని ఒడితల గ్రామానికి చెందిన 22 ఏండ్ల కప్పల వర్షిణిగా గుర్తించి తల్లి కవితకు సమాచారం ఇచ్చారు. తన కూతురిని గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజల కోసం చంపారంటూ కవిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ నెల 2న కాటారం సీఐ నాగార్జున రావు గంగారం క్రాస్ రోడ్ వద్ద వెహికల్స్ చెక్ చేస్తున్నారు. కొయ్యూరు నుంచి కాటారంకు టీవీఎస్ ఎక్సెల్ పై వెళ్తున్న కవిత, మరో వ్యక్తి.. పోలీసులను చూసి వెహికల్ వదిలేసి పారిపోయేందుకు ప్రయత్నించారు. చివరికి ఇద్దరిని పట్టుకుని విచారించగా.. భర్త కుమారస్వామి, కూతురు వర్షిణిని చంపినట్లు ఒప్పుకున్నారు.
కవిత కాళ్లు పట్టుకోగా.. రాజ్‌కుమార్ గొంతు నులిమిండు
ఒడితల గ్రామానికి చెందిన కప్పల కుమారస్వామి మొదటి భార్య చనిపోగా.. 24 ఏండ్ల కింద కొయ్యూరు మండలం తాడిచెర్లకు చెందిన మాదరవేణి కవితను పెండ్లి చేసుకున్నాడు. వారికి ఇద్దరు కూతుళ్లు. రెండో కూతురు హన్సిక పెండ్లి చేసుకుని వెళ్లిపోగా.. పెద్ద కూతురు వర్షిణి పేరెంట్స్‌తోనే ఉంటున్నది. ఐదేండ్ల కింద కుమారస్వామికి పక్షవాతం రాగా, ఇంట్లోనే ఉంటున్నాడు. మూడేండ్ల కింద కవితకు ఒడితల గ్రామానికి చెందిన జంజర్ల రాజ్ కుమార్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ఈ విషయం కుమారస్వామికి తెలియడంతో ఇంట్లో తరచూ గొడవలు జరిగేవి. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలని రాజ్‌కుమార్‌తో కలిసి కవిత ప్లాన్ చేసింది. జూన్ 25న మధ్యాహ్నం వర్షిణి లేని టైమ్‌లో రాజ్‌కుమార్‌ను కవిత ఇంటికి పిలిచింది. కుమార స్వామి (50) కాళ్లను కవిత పట్టుకోగా.. రాజ్‌కుమార్ గొంతు నులిమి చంపేశాడు. తర్వాత రాజ్‌కుమార్‌ను అక్కడి నుంచి పంపించేసిన కవిత.. అనారోగ్యంతో కుమారస్వామి చనిపోయాడని బంధువులను నమ్మించి అంత్యక్రియలు పూర్తి చేసింది.
యూట్యూబ్‌లో చూసి క్షుద్రపూజల సీన్ క్రియేట్
పోలీసులను డైవర్ట్ చేసేందుకు క్షుద్రపూజల సీన్ క్రియేట్ చేయాలనుకున్నారు. యూట్యూబ్‌లో క్షుద్రపూజలకు సంబంధించిన వీడియోలు చూసి.. డెడ్‌బాడీపై పసుపు, కుంకుమ చల్లి నిమ్మకాయలు ఉంచారు. చుట్టూ మేకులు కొట్టారు. అయినా.. భయం వదలకపోవడంతో ఇద్దరూ కలిసి మహారాష్ట్ర వెళ్లి ఏదో ఒక పని చేసుకుని బతకాలని ప్లాన్ చేసుకున్నారు.
బుధవారం (సెప్టెంబర్ 03) ఇద్దరూ కలిసి వెహికల్ వదిలేసి పారిపోయే ప్రయత్నం చేస్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. తమదైన శైలిలో విచారించగా.. కుమార స్వామి, వర్షిణిని చంపింది తామే అని ఒప్పుకున్నారు. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. హత్య కేసు ఛేదించిన డీఎస్పీ సూర్యనారాయణ, సీఐ నాగర్జున రావు, ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బందిని ఎస్పీ కిరణ్ ఖరే అభినందించారు.
తండ్రి మృతిపై నిలదీయడంతో కూతురి హత్య
తల్లి ప్రవర్తనపై వర్షిణికి అనుమానం వచ్చి ఆమెను నిలదీసింది. రాజ్‌కుమార్ తరచూ ఇంటికి రాకుండా అడ్డుకోవడంతో వర్షిణిని కూడా చంపాలని ప్లాన్ చేసింది. ఈ విషయం రాజ్‌కుమార్‌కు చెప్పింది. ఇద్దరూ కలిసి ఆగస్టు 2న అర్ధరాత్రి నిద్రపోతున్న వర్షిణిని కూడా గొంతు నులిమి చంపేశారు. డెడ్‌బాడీని సంచిలో మూటకట్టి ఇంటి వెనుక పొదల్లో దాచారు. 3వ తేదీ రాత్రి మూటను గ్రామ శివారులోని గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక దుబ్బగట్టు చెట్ల పొదల్లో పడేశారు.
వర్షిణి గురించి బంధువులు అడగడంతో వారికి అనుమానం రాకుండా చిట్యాల పోలీస్ స్టేషన్లో ఆగస్టు 6న వర్షిణి కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. గుట్టలో దాచిన డెడ్‌బాడీని రెండు రోజులకోసారి రాజ్‌కుమార్ వెళ్లి చూసి వచ్చేవాడు. శవం ఎవరికైనా కనిపిస్తే అనుమానం వస్తుందని రాజ్‌కుమార్ భయపడ్డాడు. దీంతో ఆగస్టు 25న రాత్రి 7 గంటలకు డెడ్‌బాడీని యూరియా బస్తాలో వేసి టీవీఎస్ ఎక్సెల్‌పై కమలాపూర్ క్రాస్ రోడ్డు దగ్గర కాటారం వైపు వెళ్లే నేషనల్ హైవే పక్కన పడేశాడు.