అమెరికాకు బాహుబలి అప్పాలు, భారీ సైజు సకినాలు ఎగుమతి

అమెరికాకు బాహుబలి అప్పాలు, భారీ సైజు సకినాలు ఎగుమతి

బ్రాండ్ లేదు..పేరు సంస్థకు అసలు పేరే పెట్టలేదు. అయినా వ్యాపారం జోరుగా సాగుతోంది.  క్వాలిటీ..క్వాంటిటి ఉంటే..నమ్మకం ఆటోమెటిక్ గా ఏర్పడుతుంది...వ్యాపారం విజయవంతమవుతుందని నిరూపించారు పెద్దపల్లి జిల్లా సుల్తాన్ పూర్ గ్రామ మహిళలు. 

15  ఏళ్ల క్రితం సుల్తానాపూర్‌ గ్రామానికి చెందిన లక్ష్మీ .. పదిమంది సభ్యులతో గ్రూపుగా ఏర్పాటు చేసుకుని ఇంటివద్దనే ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నారు. ఈ సమయంలో తమ గ్రూప్లోని ఓ సభ్యురాలి ఇంట్లో పెళ్లికి అప్పాలు చేయాల్సి వచ్చింది.  అందరూ కలిసి అప్పాలను, ఇతర పిండి వంటలను తయారు చేశారు. పిండి వంటల ఆలోచన నచ్చడంతో గ్రూప్ సభ్యులకు తన ఆలోచనను వివరించింది.  తక్కువ పెట్టుబడితో కూడిన వ్యాపారం కావడంతో అందరూ సరే అన్నారు. 

మంచి ఫీడ్ బ్యాక్..పెరిగిన వ్యాపారం..

పల్లె టూరిలో 11 మంది బృందంతో కూడిన స్వయం సహాయక మహిళా సంఘంతో మొదలైన వ్యాపారం..ఇవాళ  ప్రపంచానికి చేరువైంది. మొదట గ్రూప్ లోని సభ్యుల బంధువులు, స్నేహితుల ఇండ్లలో పెళ్లి, ఇతర ఫంక్షన్ల కోసం ఆర్డర్స్ మీద తయారు చేసి ఇచ్చేవారు. ఆ తర్వాత ఈ పిండి వంటల గురించి జనానికి మంచి ఫీడ్ బ్యాక్ అందడంతో క్రమంగా ఆర్డర్స్ పెరిగిపోయాయి.  ఏడాదికేడాది ఆర్డర్స్ పెరిగిపోవడంతో అప్పాలు గోలివ్వడానికి, పిండి తయారీకి, సకినాలు చేయడానికి, ఇతర పనుల కోసం రోజు వారి వర్కర్స్ ను నియమించుకుని వారికి ఉపా ధి కల్పించారు. 

ఎంత మందికి ఉపాధి..

ఒక స్వయం సహాయక మహిళా సంఘంతో మొదలైన  ఈ వ్యాపారంలోకి గ్రామంలోని  మరికొందరు మహిళలు వచ్చారు.  ప్రస్తుతం ఈ ఊర్లో మొత్తం 6 మహిళా గ్రూపులు పిండి వంటలు తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. ఒక్కో గ్రూపులోని సభ్యులు..వీరితో పాటు..50 మంది వర్కర్లు, పిండి గిర్నీ, ట్రాలీ, కట్టెలు కొట్టేవారు కలిపి దాదాపు 250 మందికి పైగా ఈ వ్యాపారంతో ఉపాధి పొందుతున్నారు. 

 
ఏమేమి వంటలు చేస్తరు.. 

పిండి వంటలంటే  భారీ సైజు అప్పాలు, గరిజలు, మురుకులు, చెగొడీలు, గవ్వలు, ఖారా, లడ్డూలు, కర్జలు.  అర్షలు, భారీ సైజు సకినాలు తయారు చేస్తారు.   క్వాలిటీలో, క్వాంటిటీలో ఎక్కడా రాజీ పడరు. ఏడాదికి దాదాపు 60 లక్షలకు పైగా ఆర్డర్స్ వస్తాయి. చుట్టు ప్రక్కల జిల్లాలతో పాటు..హైదరాబాద్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తాయి. వీరి పిండి వంటలు అమెరికాకు కూడా ఎగుమతి చేస్తారు. 

పెద్దపల్లి జిల్లా పరిసర ప్రాంతాల్లో  పెళ్లయినా.. సీమంతమైనా..ఇతర ఏ పండగైనా.. సుల్తాన్ పూర్ స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన పిండి వంటలు ఉండాల్సిందే. తమ మీద నమ్మకంతో ఆర్డర్స్ ఇచ్చేవారికి క్వాలిటీగా పిండి వంటలు తయారు చేసి ఇస్తూ..ఇక్కడి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. పది మందికి ఉపాధి కల్పిస్తున్నారు.