
కాగ జ్ నగర్, వెలుగు: నీళ్లు రావడం లేదని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, గ్రామాల్లో బెల్ట్ షాపుల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని, వాటిని వెంటనే బంద్చేయాలని మహిళలు ధర్నాకు దిగారు. కాగజ్‌నగర్ మండలంలోని బట్టుపల్లిలో ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించారు. 15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదని, వచ్చినా బురదగా వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీడీవో ప్రసాద్ వచ్చి, నీరందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో శాంతించారు.
చింతగూడ, కోయవాగు మహిళలు కాగజ్ నగర్ పట్టణంలోని ఎక్సైజ్ ఆఫీస్ ఎదుట నిరసన తెలిపారు. గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారని, తమ కుటుంబసభ్యులు మద్యం మత్తులో వచ్చి, కొడుతున్నారని వాపోయారు. బెల్ట్ షాపులను వెంటనే బంద్చేయాలని కోరుతూ ఎక్సైజ్ సీఐ రవికుమార్ కు వినతిపత్రం అందజేశారు. మాజీ ఎంపీటీసీ రవీందర్ వారికి మద్దతు తెలిపారు. బెల్ట్ షాపులను కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.