
అనర్హులకు ఇచ్చారని వాటర్ ట్యాంక్ ఎక్కిన మహిళలు
చింతకాని, వెలుగు: అల్రెడీ ఇండ్లు ఉన్నోళ్లకే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించారని గురువారం ఖమ్మం జిల్లా చింతకాని మండలం రైల్వేకాలనీకి చెందిన మహిళలు వాటర్‌ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. ఇదే మండలంలోని నాగులవంచలో ఇటీవల నిర్వహించిన గ్రామసభ కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు విషయంలో ఉద్రిక్తతల మధ్య ముగిసింది. అర్హులకే ఇండ్లు ఇవ్వాలంటూ ఖమ్మం–బోనకల్ రోడ్డుపై రాస్తారోకో చేశారు. పక్కపక్కనే ఉండే నాగులవంచ, రైల్వే కాలనీ గ్రామాల్లో ప్రభుత్వం 74 ‘డబుల్’ ఇండ్లు కట్టింది. వీటి కోసం 174 దరఖాస్తులు వచ్చాయి. ఇటీవల తహసీల్దార్కె.సత్యనారాయణ ఆధ్వర్యంలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. డ్రాలో పేదలకు కాకుండా ఇండ్లు ఉన్న వారికే మళ్లీ వచ్చాయని గురువారం పలువురు మహిళలు రైల్వే కాలనీలో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్, స్థానిక ఎస్సై రవి కిరణ్ అక్కడికి చేరుకున్నారు. ట్యాంక్దిగాలని మహిళలను కోరారు. స్పష్టమైన హామీ ఇస్తేనే కిందికి వస్తామని వారు తెగేసి చెప్పారు. మళ్లీ సర్వే చేసి అర్హులకే ఇండ్లు కేటాయిస్తామని తహసీల్దార్ హామీ ఇవ్వడంతో మహిళలు ట్యాంక్ దిగారు.