తిరువనంతపురం: శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఎల్డీఎఫ్ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ విషయంపై సుప్రీంకోర్టులో సవరించిన అఫిడవిట్ దాఖలు చేయాలని కోరాయి. సోమవారం పాలక్కాడ్‌లో కేరళ అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు వీడీ. సతీశన్ మీడియాతో మాట్లాడారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుంటుందని హామీ ఇచ్చి అనేక సంస్థలను గ్లోబల్ అయ్యప్ప సంగమానికి ఆహ్వానించారని ఆరోపించారు. ప్రభుత్వం గందరగోళ విధానాన్ని అవలంభిస్తున్నదని, స్పష్టమైన వైఖరిని అనుసరించడం లేదని తెలిపారు.
ప్రభుత్వం తన ద్వంద్వ వైఖరిని వీడాలని డిమాండ్ చేశారు. ‘‘మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా పాత అఫిడవిట్‌ను సవరించడానికి 10 నిమిషాల సమయం చాలు. ఒకవైపు అయ్యప్ప భక్తుల ఓట్లు కావాలంటూనే, మరోవైపు గందరగోళ విధానాన్ని అవలంబించడం సరికాదు’’ అని ఆయన విమర్శించారు. ఒకవేళ ప్రస్తుత ప్రభుత్వం అఫిడవిట్‌ను మార్చకపోతే, భవిష్యత్తులో యూడీఎఫ్ అధికారంలోకి వస్తే కచ్చితంగా మారుస్తున్నదని ఆయన హామీ ఇచ్చారు.
మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికల ప్రయోజనాల కోసం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చని విమర్శించారు. గ్లోబల్ అయ్యప్ప సంగమం నిర్వహించిన ప్రభుత్వం.. రేపు ఆలయంలోని మహిళల ప్రవేశం విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేమని పేర్కొన్నారు. ఈ విషయంలో బీజేపీ పాత స్టాండ్‌కే కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయం లోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ దాఖలైన 67 పిటిషన్లను సుప్రీంకోర్టు ఏప్రిల్ 7 నుంచి విచారించనుంది.
