
- ఆలేరులో వినూత్న నిరసన
యాదాద్రి, వెలుగు : డబుల్ బెడ్ రూమ్ఇండ్ల కోసం మహిళలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తమకు ఇండ్లు లేవంటూ, వెంటనే ఇవ్వాలంటూ యదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు తహసీల్దార్ ఆఫీసులో బుధవారం రాత్రి నిద్రపోయారు. యాదాద్రి జిల్లా ఆలేరులో 64 డబుల్బెడ్రూమ్ ఇండ్లు నిర్మించారు. వీటి పంపిణీకి ఇటీవల అప్లికేషన్లు ఆహ్వానించి 120 మందిని అర్హులుగా గుర్తించారు. ఇటీవల నిర్వహించిన డ్రాలో లబ్ధిదారులను ఎంపిక చేశారు.
డ్రాలో బీఆర్ఎస్లీడర్లు, కౌన్సిలర్లకు సంబంధించిన వారి పేర్లే వచ్చాయని, వారికే ఇండ్లు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలోనే అర్హులైన తమకు ఇండ్లు రాలేదని మున్సిపాలిటీలోని 4వ వార్డుకు చెందిన మహిళలు కొందరు బుధవారం సాయంత్రం ఆలేరు తహసీల్దార్ఆఫీసుకు వెళ్లారు. ఇండ్లు లేని తమకు తహసీల్దార్ఆఫీసే ఇల్లంటూ అక్కడి వరండాలో కూర్చున్నారు. కొందరు మహిళలైతే ఏకంగా నిద్ర పోయారు.
విషయం తెలుసుకున్న తహసీల్దార్రామక్రిష్ణ పోలీసులకు సమాచారం అందించగా, వారు చేరుకొని మహిళలకు నచ్చజెప్పారు. చివరకు రాత్రి 10.30 గంటలకు వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ మహిళలే గురువారం ర్యాలీ నిర్వహించారు. ఇండ్ల కేటాయింపులో అవకతవకలకు పాల్పడిన తహసీల్దార్రామకృష్ణను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.