సిద్దిపేట జిల్లాలో మహిళ లే కీలకం .. జిల్లాలో మహిళా ఓటర్లే అధికం

సిద్దిపేట జిల్లాలో మహిళ లే కీలకం .. జిల్లాలో మహిళా ఓటర్లే అధికం
  • 4.68 లక్షల మంది యువ ఓటర్లు
  • అన్ని పొలిటికల్​ పార్టీలు వీరి ప్రసన్నం కోసం పాట్లు

సిద్దిపేట, వెలుగు:  రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నేతల తలరాతలు మార్చే నిర్ణయాత్మక పాత్రను యువత, మహిళలు పోషించనున్నారు.  జిల్లాలో మొత్తం ఓటర్ల లో పురుష ఓటర్లు 49.4 శాతం, మహిళా ఓటర్లు 50.58 శాతం ఉన్నారంటే వారి ఓట్లు ఎంత కీలకమో అర్థం అవుతోంది. యువకులు, మహిళలు ఎటు వైపు మొగ్గు చూపితే వారికే విజయావకాశాలు మెండుగా ఉండడంతో అభ్యర్థులు వీరిపైనే దృష్టి సారిస్తున్నారు.  ఇప్పటికే గ్రామాల వారీగా వివరాలు సేకరించుకున్న నేతలు వారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికే పలువురు నేతలు మహిళలకు కుట్టుమిషన్లు,  కుక్కర్లు అందజేసి మద్దతు పొందే ప్రయత్నాలు చేశారు. 

మెజార్టీ ఓట్లు మహిళలే.. 

జిల్లాలోని  సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్​ నియోజకవర్గాలుండగా  అన్నిట్లో పురుషు ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు.  గత జనాభా లెక్కల ప్రకారం జిల్లా  మొత్తం జనాభా 10,65,127 కాగా ఇందులో పురుషుల సంఖ్య 5,30,639, మహిళల సంఖ్య 5,34,488. పురుషుల కంటే మహిళలు 3,849 ఎక్కువున్నారు. జిల్లాలోని నాలుగు స్థానాల పరిధిలో 9,25,398  మొత్తం  ఓటర్లుండగా  వీరిలో పురుషులు  4,57, 178,  మహిళలు  4,68, 140 మంది ఉన్నారు. వీరిలో  పురుషుల కంటే మహిళా ఓటర్లు 10,972 మంది ఎక్కువగా ఉండటం గమనార్హం. జిల్లా మొత్తంలో 21 వేల మహిళా సంఘాలుండగా  వీటిలో 17వేల గ్రూపులు ఉన్నాయి. ఇందులో  రెండు లక్షలకు పైగా మహిళా సభ్యులున్నారు. మునిసిపల్ ప్రాంతంలో 4 వేల మహిళా సంఘాలుండగా వీటిలో యాభై వేల మంది మహిళలు ఉన్నారు. 

యువత వివరాల సేకరణ

ఎన్నికల్లో ఎంతో క్రియాశీలకంగా వ్యవహరించే యువకుల వివరాల సేకరణలో నేతలు నిమగ్నమయ్యారు. చదువు, ఉపాధి, ఉద్యోగాల వేటలో ఇతర ప్రాంతాలకు వెళ్లిన యువకుల వివరాలను ఇప్పటికే సేకరించి వారితో సంప్రదింపులు జరుపుతున్నారు. స్థానికంగా గ్రామాల్లో ఉన్న యువకులను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దసరాకు గ్రామాలకు వచ్చిన యువకులను కలసి ఓటింగ్ రోజు గ్రామాలకు మళ్లీ రావాలని విజ్ఞప్తులు చేస్తున్నారు.

జిల్లాలో 40 సంవత్సరాల లోపు 4.68 లక్షల మంది యువకులు ఉన్నారు.  ఈనెల 31 వరకు కొత్తగా ఓటర్లు నమోదు చేసుకునే అవకాశం ఉండటంతో వీరిలో ఎక్కువ మంది యువకులే ఉండే అవకాశం ఉంది. దీంతో సంఖ్య మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాలోని యువ ఓటర్లు అత్యధికంగా  గజ్వేల్లో  1.39 లక్షలు, తరువాతి స్థానాల్లో   హుస్నాబాద్ లో 1.16,  సిద్దిపేటలో 1.06, దుబ్బాకలో  96,150 యువ ఓటర్లు ఉన్నారు.