కోరుట్లలో ఉద్రిక్తత.. మహిళలను ఈడ్చుకెళ్లిన పోలీసులు

కోరుట్లలో ఉద్రిక్తత.. మహిళలను ఈడ్చుకెళ్లిన పోలీసులు

జగిత్యాల జిల్లా కోరుట్లలో ఉద్రిక్త చోటుచేసుకుంది.  కోరుట్ల పట్టణం సంగెం రోడ్ లోని ప్రభుత్వ స్థలంలో  నిరుపేదలు వేసుకున్న గుడిసెలను అధికారులు తొలగించారు.  అయితే ఆ  స్థలాన్ని తమకే కేటాయించాలంటూ  మహిళలు ఆందోళన చేస్తున్నారు. సీపీఎం ఆధ్వర్యంలో 46 రోజులుగా గుడిసెలు వేసి ఆందోళన చేస్తున్నారు  మహిళలు.  ఇవాళ ఉదయం  పోలీసుల సహకారంతో సీపీఎం జెండా గద్దెను, గుడిసెలను జేసీబీతో తీసివేశారు రెవెన్యూ సిబ్బంది.  

దీంతో గుడిసెల తొలగింపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయానికి బయలుదేరారు మహిళలు. పెద్ద ఎత్తున ఆర్డీవో ఆఫీస్ దగ్గరకు వెళ్తున్న మహిళలను, సీపీఎం నేతలను   పోలీసులు అడ్డుకున్నారు.  దీంతో పోలీసులకు మహిళలకు మధ్య తోపులాట జరగడంతో  పరిస్థితి  ఉద్రిక్తంగా మారింది. పోలీసులు మహిళలను ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్ కు తరలించారు.