సర్కార్ బడుల బాధ్యత మహిళా సంఘాలకు

సర్కార్ బడుల బాధ్యత మహిళా సంఘాలకు
  • ప్రతి స్కూల్​లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ
  • ఆ కమిటీల ఆధ్వర్యంలోనే అభివృద్ధి పనులు 
  • రూ.25 వేల లోపు పనులన్నీ కమిటీల అనుమతితోనే.. 
  • ‘బడి బాట’ బాధ్యతలు కూడా అప్పగింత 

హైదరాబాద్, వెలుగు:  ప్రభుత్వ పాఠశాలల్లో సరికొత్త విధానాలకు సర్కార్ శ్రీకారం చుట్టింది. గవర్నమెంట్ బడులను బాగు చేయాలనే లక్ష్యంతో అన్ని గ్రామాల్లో పాఠశాలల బాగోగులు చూసుకునే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలో ఆయా గ్రామాల మహిళా సంఘం అధ్యక్షురాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ప్రతి తరగతి నుంచి ముగ్గురు విద్యార్థుల తల్లులు ఉంటారు. ఇకపై పాఠశాలల్లో జరిగే పనులన్నీ ఈ కమిటీల తీర్మానంతోనే చేపడతారు. రూ.25 వేల లోపు ఖర్చయ్యే పనులన్నీ డైరెక్టుగా కమిటీలే చేస్తాయి. 

రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చయ్యే పను లకు ఎంపీడీవో, రూ. లక్ష దాటిన పనులకు కలెక్టర్ అనుమతి తీసుకుని చేపడతాయి. ఈ విద్యా సంవత్సరం నుంచే ఈ కార్యాచరణ మొదలుపెట్టాలని, పాఠశాలల్లో తక్షణమే పూర్తి చేయాల్సిన పనులను గుర్తించి  జూన్ 10లోగా కంప్లీట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం రూ.600 కోట్లు ఇప్పటికే విడుదల చేసింది. కాగా, పాఠశాలల్లో కిటికీలు, తలుపులు, ఎలక్ట్రిక్ స్విచ్‌‌ బోర్డులు, ఫ్యాన్లు,  మరుగుదొడ్లకు తాత్కాలిక మరమ్మతులు తదితర పనులను ఆదర్శ కమిటీలు చేయనున్నాయి. మహిళా సంఘాలపై భారం పడకుండా ఆదర్శ కమిటీలు చేపట్టే పనులకు రూ.25 వేలు అడ్వాన్సుగా ఇచ్చారు. 

ఇప్పటికే విద్యార్థులకు స్కూల్ యూనిఫామ్ కుట్టే పనులను మహిళా సంఘాలకు అప్పగించిన ప్రభుత్వం.. ఇప్పుడు పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేసే బాధ్యతలను కూడా అప్పగించింది. దీంతో మహిళా సంఘాలకు స్థానికంగా ఉపాధి దొరకడంతో పాటు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. మరోవైపు ఈసారి బడిబాట కార్యక్రమాన్ని ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెరుగుతుందని, తల్లుల పర్యవేక్షణ పెంచడం ద్వారా బడిలో చేరే ఆడపిల్లల సంఖ్య కూడా పెరుగుతుందని యోచిస్తున్నది. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు మహిళా సంఘాలు కీలకపాత్ర పోషిస్తాయని భావిస్తున్నది.