కిస్తీలు కట్టలేక కష్టాల్లో మహిళా సంఘాలు

కిస్తీలు కట్టలేక కష్టాల్లో మహిళా సంఘాలు
  • 7,200 సంఘాలను మొండి బాకీల లిస్టులో చేర్చిన బ్యాంకులు
  • కరోనాతో ఉపాధి కోల్పోయి, ఇంటి పెద్దలు చనిపోయి ఆర్థిక ఇబ్బందుల్లో మహిళలు
  • లోన్లు రికవరీ చేయడం లేదని సెర్ప్ సిబ్బందిపై రాష్ట్ర సర్కార్ చర్యలు 
  • రంగారెడ్డిలో 43 మంది జీతం నిలిపివేత 
  • కామారెడ్డిలో ఏపీడీ, ఏపీఎం, సీసీల సస్పెన్షన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మహిళా సంఘాల(డ్వాక్రా గ్రూపులు)పై కరోనా ఎఫెక్ట్ పడింది. కరోనా, లాక్ డౌన్ కారణంగా చాలా కుటుంబాలు ఉపాధి కోల్పోయాయి. కరోనా సోకి అనేక కుటుంబాల్లో ఆస్పత్రి ఖర్చులు పెరిగిపోయాయి. వైరస్ వల్ల సంఘం సభ్యురాలో, ఆమె భర్తనో చనిపోయిన కుటుంబాలూ ఉన్నాయి. ఉన్న ఉపాధి పోయి, ఇంటి పెద్దను కోల్పోయి చాలామంది మహిళలు లోన్ కిస్తీలు కట్టలేకపోతున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 7,200 సంఘాలను బ్యాంకులు నాన్ పెర్ఫామింగ్ అస్సెట్ (ఎన్పీఏ) జాబితాలో చేర్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రీపేమెంట్ పర్సంటేజీ 99 శాతం నుంచి 97 శాతానికి తగ్గింది. రీపేమెంట్స్ తగ్గడంతో లోన్లు రికవరీ చేయాలని సెర్ప్ ఉన్నతాధికారులు కిందిస్థాయి సిబ్బందికి టార్గెట్లు విధిస్తున్నారు. ఏ మండలంలో కిస్తీలు చెల్లించని సంఘాలుంటే ఆయా ఏపీఎంలు, సీసీలతో పాటు జిల్లా స్థాయి ఏపీడీ, డీపీఎంలపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని జిల్లాల్లో షోకాజ్ నోటీసులు జారీ చేస్తూ జీతాలు నిలిపివేస్తుండగా.. మరికొన్ని జిల్లాల్లో ఏకంగా సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. ఇబ్బందుల్లో ఉన్న మహిళల నుంచి లోన్ రికవరీ చేయలేకపోతున్నామని సెర్ప్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లోన్ల మంజూరుకు సర్కార్ టార్గెట్లు పెట్టడంతో అవసరం లేకున్నా మహిళలు లోన్లు తీసుకునేలా చేయాల్సి వస్తోందని, మళ్లా రికవరీ విషయంలోనూ ఇబ్బందులు తప్పడం లేదని వాపోతున్నారు. 

అభయ హస్తం రద్దుతో అందని పరిహారం... 
గతంలో డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలంతా అభయ హస్తం స్కీమ్ లో ఉండేవారు. వారికి ఆమ్ ఆద్మీ బీమా యోజన వర్తించేది. ఈ పథకంలో ఉన్న మహిళ లేదా ఆమె భర్త ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.75 వేలు, సహజ మరణమైతే రూ.30 వేల పరిహారం ఇచ్చేవారు. అంత్యక్రియలకు మరో రూ.5 వేలు చెల్లించేవారు. సభ్యుల పిల్లలకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు రూ.1,200 స్కాలర్ షిప్ కూడా అందించేవారు. కానీ రాష్ట్ర సర్కార్ ఏడాది క్రితం ఈ స్కీమ్ ను రద్దు చేసింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు గానీ, వారి భర్తలు గానీ మరణిస్తే పరిహారం అందడం లేదు. గతంలో ఈ స్కీమ్ కింద పరిహారం వస్తే లోన్ బకాయి చెల్లించడానికైనా ఉపయోగపడేదని, ఇప్పుడదీ లేకపోవడంతో కుటుంబాలపై భారం పడుతోందని, లోన్లు చెల్లించకపోవడంతో ఎన్పీఏ లిస్టులో చేరుతున్న గ్రూపుల సంఖ్య పెరుగుతోందని మహిళా సంఘాల సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా, లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళల లోన్లను ప్రభుత్వం మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

భర్త చనిపోయి ఆర్థిక ఇబ్బందులు.. 
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తులేకుర్దు గ్రామానికి చెందిన మస్కు భారతమ్మ మహిళా స్వయం సహాయక సంఘంలో సభ్యురాలు. ఆమె గ్రూప్ తరఫున నిరుడు రూ.5 లక్షల లోన్ తీసుకోగా, ఆమె వాటా కింద రూ.50 వేలు వచ్చాయి. ఆ లోన్ కిస్తీలు నాలుగైదు నెలలు కట్టినంక, ఆమె భర్తకు కరోనా సోకింది. భయాందోళనకు గురైన ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో భారతమ్మ పుట్టింటికి వెళ్లడం, ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో లోన్ కిస్తీ కట్టలేని పరిస్థితి నెలకొంది. ఇప్పుడామె చెల్లించాల్సిన లోన్ అసలు, వడ్డీ కలిపి రూ.60 వేలకు చేరుకుంది. పూర్తి స్థాయిలో లోన్ రీపేమెంట్ చేయకపోవడంతో ఆ గ్రూపును బ్యాంకు అధికారులు నాన్ పెర్ఫామింగ్ అస్సెట్ (ఎన్పీఏ) లిస్టులో చేర్చారు. 

10 వేల కుటుంబాలపై ప్రభావం 
రాష్ట్ర వ్యాప్తంగా 3,80,150 మహిళా సంఘాలు ఉండగా.. దాదాపు 10 వేల కుటుంబాలపై కరోనా ప్రభావం పడినట్లు అంచనా. కొన్ని గ్రామాల్లో సంఘం సభ్యురాలైన మహిళలు చనిపోతే, మరికొన్ని చోట్ల మహిళల భర్తలు చనిపోయారు. దీంతో చాలామంది తాము తీసుకున్న లోన్ కట్టలేని పరిస్థితి నెలకొంది. సెర్ప్ ఉన్నతాధికారులు మాత్రం మహిళల సమస్యలను తమకు చెప్పొద్దని, వాళ్ల నుంచి లోన్ రికవరీ చేయాల్సిందేనని సిబ్బందికి హుకుం జారీ చేస్తున్నారు. లేదంటే జీతాలు నిలిపివేస్తా మని హెచ్చరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 43 మంది శాలరీలు ఆపేశారు. కామారెడ్డి జిల్లాలో ఏపీడీ, ఏపీఎం, సీసీని సస్పెండ్ చేశారు. తామున్న దుస్థితిలో ఒక్క రూపాయీ కట్టలేమని మహిళలు వాపోతున్నారని, తామేం చేసేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఒకే తండాలో 10 గ్రూపులు ఎన్పీఏ లిస్టులోకి.. 
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతు తండాలో 18 మహిళా సంఘాలు ఉన్నాయి. వీటిలో 10 సంఘాలకు చెందిన మహిళల భర్తలు హైదరాబాద్ లో ఆటో నడుపుతారు. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా కిరాయిలు దొరక్క కుటుంబం గడవడమే కష్టంగా మారింది. దీంతో మహిళలు లోన్ కిస్తీలు చెల్లించకపోవడంతో 10 గ్రూపులూ డిఫాల్టర్స్ గా మారాయి.