బీసీసీఐపై మరోసారి కాసుల వర్షం

బీసీసీఐపై మరోసారి కాసుల వర్షం

అహ్మదాబాద్‌ ఫ్రాంచైజీకి అత్యధికంగా రూ. 1289 కోట్లు
మూడు మెన్స్‌ ఫ్రాంచైజీలకు విమెన్​ టీమ్స్‌

ముంబై: బీసీసీఐపై మరోసారి కాసుల వర్షం కురిసింది. డెబ్యూ ‘విమెన్స్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌ (డబ్ల్యూపీఎల్‌‌)’ ఫ్రాంచైజీల కోసం బడా కంపెనీలు వందల కోట్లు కుమ్మరించాయి. మొత్తం ఐదు ఫ్రాంచైజీలను వేలం వేయగా.. వీటి ద్వారా ఇండియన్‌‌ బోర్డుకు రూ. 4669.99 కోట్ల ఆదాయం వచ్చింది. బుధవారం జరిగిన క్లోజ్డ్‌‌ డోర్‌‌ బిడ్డింగ్‌‌లో సాంకేతికంగా సరిగ్గా ఉన్న 17 బిడ్స్‌‌ను ఓపెన్‌‌ చేశారు. ఇందులో అహ్మదాబాద్‌‌ టీమ్‌‌ను.. అదానీ స్పోర్ట్స్‌‌ లైన్‌‌ అత్యధికంగా రూ. 1289 కోట్లకు కొనుగోలు చేసింది. 2021లో ఐపీఎల్‌‌కు సంబంధించి లక్నో, అహ్మదాబాద్‌‌ ఫ్రాంచైజీలను కొనుగోలు చేయడంలో విఫలమైన అదానీ గ్రూప్‌‌ ఎట్టకేలకు ఇండియన్‌‌ క్రికెట్‌‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఐపీఎల్‌‌కు చెందిన ముంబై ఇండియన్స్‌‌, రాయల్‌‌ చాలెంజర్స్‌‌ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌‌ కూడా విమెన్స్‌‌ టీమ్స్‌‌ను దక్కించుకున్నాయి. ముంబై టీమ్‌‌ను ఇండియా విన్‌‌ స్పోర్ట్స్‌‌ రూ. 912.99 కోట్లకు, బెంగళూరు జట్టును రాయల్‌‌ చాలెంజర్స్‌‌ స్పోర్ట్స్‌‌ రూ. 901 కోట్లకు, ఢిల్లీ టీమ్‌‌ను జేఎస్‌‌డబ్ల్యూ జీఎంఆర్‌‌ క్రికెట్‌‌ రూ. 810 కోట్లకు కొనుగోలు చేశాయి. లక్నో టీమ్‌‌ను.. కాప్రీ గ్లోబల్‌‌ హోల్డింగ్స్‌‌ రూ. 757 కోట్లకు చేజిక్కించుకుంది. ఓవరాల్‌‌గా 2008లో మెన్స్‌‌ ఐపీఎల్‌‌లో 8 జట్లను 723.59 మిలియన్‌‌ డాలర్లకు అమ్మితే.. విమెన్స్‌‌ టీమ్స్‌‌కు అంతకంటే మంచి ధర పలికాయి. గత కొన్ని రోజులుగా ‘విమెన్స్‌‌ ఐపీఎల్‌‌’గా ముద్ర పడిన ఈ లీగ్‌‌ పేరును కూడా ‘విమెన్స్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌’గా మార్చారు. ‘క్రికెట్‌‌లో చారిత్రాత్మకమైన రోజు ఇది. డబ్ల్యూపీఎల్‌‌ వేలం 2008 ఐపీఎల్‌‌ రికార్డులను బద్దలుకొట్టింది. టీమ్స్‌‌ను గెలుచుకున్న ఫ్రాంచైజీలకు అభినందనలు’ అని బీసీసీఐ సెక్రటరీ జై షా ట్వీట్‌‌ చేశారు.

మొత్తం 22 మ్యాచ్‌లు.. 

డబ్ల్యూపీఎల్‌ ఫస్ట్‌ ఎడిషన్‌ టోర్నీని మార్చిలో నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ప్లాన్‌ రెడీ చేసింది. దీంతో ప్లేయర్ల వేలాన్ని వచ్చే నెలలో నిర్వహించనున్నారు. విమెన్స్‌ టోర్నీలో ఐదు జట్లు 22 మ్యాచ్‌లు ఆడనున్నాయి. లీగ్‌ స్టేజ్‌లో టాప్‌ ప్లేస్‌లో నిలిచిన టీమ్‌ డైరెక్ట్​గా ఫైనల్‌కు వెళ్తుంది. రెండు, మూడో ప్లేస్‌లో నిలిచిన జట్ల మధ్య విన్నర్‌.. టైటిల్‌ ఫైట్‌కు అర్హత సాధిస్తుంది. ప్లేయర్ల కొనుగోలు కోసం ప్రతి ఫ్రాంచైజీ రూ. 12 కోట్లు కేటాయించనుంది. ప్రతి టీమ్‌లో 15 నుంచి 18 మంది ఉంటారు. అసోసియేట్‌ కంట్రీని కలుపుకుని ప్రతి టీమ్‌ ఫైనల్‌ ఎలెవన్‌లో ఐదుగురు విదేశీ ప్లేయర్లకు ఆడే చాన్స్‌ ఇవ్వనున్నారు.