తెలంగాణలో 14 ఎంపీ స్థానాలు గెలుస్తం : వివేక్​ వెంకటస్వామి

తెలంగాణలో 14 ఎంపీ స్థానాలు గెలుస్తం :  వివేక్​ వెంకటస్వామి
  • కాంగ్రెస్ సర్కార్​తోనే సంక్షేమం, ప్రజాపాలన సాధ్యం: వివేక్​ వెంకటస్వామి
  •     కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
  •     కేసీఆర్​ కుటుంబ అహంకార పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వెల్లడి

కోల్​బెల్ట్/చెన్నూరు, వెలుగు:  రాబోయే లోక్​సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 నుంచి 14 మంది కాంగ్రెస్ అభ్యర్థులు ఎంపీలుగా గెలుస్తారని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. కాంగ్రెస్​ సర్కారు​ అమలు చేస్తున్న సంక్షేమ, ప్రజాపాలనతో ప్రజలు కాంగ్రెస్​ అభ్యర్థులను గెలిపించేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం గడ్డం వంశీకృష్ణను ప్రకటించిన తర్వాత తొలిసారి వివేక్​ వెంకటస్వామి, వంశీకృష్ణ శనివారం మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివేక్​ వెంకటస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వంశీకృష్ణను ప్రకటించిందని, ఆయన అభ్యర్థిత్వంపై ప్రజల్లో మంచి స్పందన ఉందన్నారు. 

సీఎం రేవంత్​రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశారని, వందరోజుల్లో ఐదు గ్యారంటీలను ఎలా అమలు చేశారని ప్రజలు అశ్చర్యపడుతున్నారన్నారు. గత బీఆర్ఎస్​ సర్కారు ​రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిందని, ప్రజలకు ఉపయోగపడే పనులకు ఖర్చుపెట్టకుండా నిధులను ​దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. ఇష్టారాజ్యంగా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చి తెలంగాణను కాంట్రాక్టర్ల దందా రాజ్యంగా మార్చిందని దుయ్యబట్టారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క డబుల్​ బెడ్రూం​ఇల్లు ఇవ్వకుండా కేసీఆర్​ మాట తప్పారని, దీంతో కేసీఆర్​ కుటుంబ అహంకార పాలనకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని పేర్కొన్నారు. కాంగ్రెస్​ సర్కార్​ అధికారంలోకి రావడంతో ప్రజలకు స్వాతంత్ర్యం నాటి స్వేచ్ఛ వచ్చిందని సంతోషపడుతున్నారన్నారు. సీఎం రేవంత్​రెడ్డి హయాంలో ‘మా నిధులు మాకే దక్కుతున్నాయి’అని ప్రజలు ఆనందంగా ఉన్నట్లు వివేక్ పేర్కొన్నారు. 

ప్రజలే నాకు టికెట్ ​వచ్చేలా చేశారు: వంశీకృష్ణ

పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల ప్రజలు కోరుకొని.. తనకు ఎంపీ టికెట్​వచ్చేలా చేశారని పెద్దపల్లి కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ అన్నారు. కాంగ్రెస్​ శ్రేణులు, కాకా వెంకటస్వామి, వివేక్​ వెంకటస్వామి అభిమానుల కోరిక కూడా అదేనన్నారు. ఎంపీ అభ్యర్థిగా మొదటిసారి చెన్నూరుకు రావడం ఆనందంగా ఉందన్నారు. పెద్దపల్లి పార్లమెంటుతో కాకాకు 70 ఏండ్ల అనుబంధం, వివేక్​ వెంకటస్వామికి ఐదేండ్ల అనుబంధం ఉందని గుర్తుచేశారు. పదేండ్ల బీఆర్ఎస్​ పాలన తర్వాత కూడా వెంకటస్వామి, వివేక్​ చేసిన అభివృద్ధి మాత్రమే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కనిపిస్తోందన్నారు. కాకా కుటుంబంతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు తనకు ఎంపీగా పోటీ చేసే చాన్స్​ ఇచ్చారన్నారు. తనకు టికెట్​రావడానికి మంత్రి శ్రీధర్​బాబు, ఎమ్మెల్యేలు విజయరామణరావు, అడ్లూరి లక్ష్మణ్, మక్కాన్​సింగ్, ప్రేమ్​సాగర్​రావు, గడ్డం వినోద్, వివేక్​ వెంకటస్వామి కృషిచేశారని, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వంశీకృష్ణ  పేర్కొన్నారు. కాగా, శనివారం రాత్రి  మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్ లోని ఆస్రా మజీదులో ముస్లింలకు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి ఇఫ్తార్​ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు తదితరులు పాల్గొన్నారు.

వంశీకృష్ణకు ఘనస్వాగతం

పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.. ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామితో కలిసి తొలిసారిగా చెన్నూరు నియోజకవర్గానికి రావడంతో కాంగ్రెస్​ శ్రేణులు, కాకా అభిమానులు ఘనస్వాగతం పలికారు. జైపూర్​ మండలం ఇందారం, జైపూర్, భీమారం మండల కేంద్రాలతో పాటు చెన్నూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్​లో వంశీకృష్ణ, వివేక్​ను ఘనంగా సత్కరించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.