‌సిద్ధూకు పాక్‌తో సంబంధాలున్నాయి.. సీఎంగా ఒప్పుకోను

‌సిద్ధూకు పాక్‌తో సంబంధాలున్నాయి.. సీఎంగా ఒప్పుకోను

చండీగఢ్‌: పంజాబ్ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూను ముఖ్యమంత్రిగా తాను ఒప్పుకోలేదని కెప్టెన్ అమరీందర్ సింగ్ స్పష్టం చేశారు. కొన్ని నెలలుగా నడుస్తున్న సిద్ధూ వర్సెస్ కెప్టెన్ క్రైసిస్‌కు తెరదించుతూ ఇవాళ (శనివారం) సాయంత్రం కెప్టెన్ తన సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు కేబినెట్ మొత్తం రాజీనామా చేసినట్లు అమరీందర్ ప్రకటించారు. అనంతరం ఆయనను ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీ ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కాంగ్రెస్ చీఫ్​ సోనియా గాంధీతో ఉదయం ఫోన్‌లో రాజీనామా గురించి చెబితే ఆమె ‘‘సారీ అమరీందర్’’ అని అన్నారని చెప్పారు. తనకు పదే పదే అవమానాలు ఎదురవుతుండడంతోనే పదవికి రాజీనామా చేశానని కెప్టెన్ తెలిపారు.

నవజోత్‌ సింగ్ సిద్ధూ ఒక అసమర్థుడని, ఆయన ఒక అట్టర్ ఫెయిల్యూర్‌‌గా మిగలబోతున్నారని అన్నారు. తర్వాతి సీఎంగా సిద్ధూ పేరును తాను వ్యతిరేకిస్తున్నానని కెప్టెన్ చెప్పారు. సిద్ధూకు పాక్‌తో కనెక్షన్ ఉందని, ఆయన దేశ భద్రతకే ముప్పుగా మారుతాడని అన్నారు. దేశ భద్రత కోసమే సిద్ధూను సీఎంగా తాను ఒప్పుకోలేనని,  ఆయనకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫ్రెండ్ అని, పాక్ ఆర్మీ చీఫ్ జావెద్ బజ్వాతోనూ మంచి సంబంధాలు ఉన్నాయని కెప్టెన్ అన్నారు.

అంతకుముందు రాజ్‌భవన్ గేట్ వద్ద మీడియాతో మాట్లాడిన కెప్టెన్ తనకు కాంగ్రెస్‌లో పదే పదే అవమానం జరుగుతోందని, తాను సీఎంగా కొనసాగలేనని ఈ రోజు ఉదయమే కాంగ్రెస్ చీఫ్​ సోనియా గాంధీకి స్పష్టం చేశానని తెలిపారు. తన సమర్థతపై నమ్మకం లేకుంటే, హైకమాండ్‌కు నమ్మకం ఉన్న వాళ్లనే సీఎంగా చేసుకోవచ్చని చెప్పానన్నారు. తన భవిష్యత్ ప్రణాళికపై కార్యకర్తలు, సన్నిహితులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని కెప్టెన్ చెప్పారు. 1965 ఇండో పాక్ యుద్ధంలో సర్వీస్ చేసిన కెప్టెన్ అమరీందర్ దాదాపు 50 ఏండ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఆయన 19 ఏండ్లు సీఎంగా చేశారు.