రామ జన్మభూమిపై మధ్యవర్తిత్వం వద్దు

రామ జన్మభూమిపై మధ్యవర్తిత్వం వద్దు
  • సుప్రీం ధర్మాసనం ఎదుట రామ్ లల్లా విరాజ్మాన్

న్యూఢిల్లీ: అయోధ్య కేసులో మధ్యవర్తిత్వాన్ని తాము కోరుకోవడం లేదంటూ పిటిషనర్లలో ఒకరైన ‘రామ్ లల్లా విరాజ్మాన్’ సుప్రీం కోర్టుకు తెలిపింది. ఈ కేసులో రోజువారీ విచారణలో భాగంగా సోమవారం 34వ రోజు వాదనలు జరిగాయి. సీజేఐ జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ముందు పిటిషన్లు తమ వాదనలు వినిపించారు.

రామ్ లల్లా విరాజ్మాన్ తరఫున వాదనలు వినిపించిన లాయర్ వైద్యనాథన్.. రామ జన్మభూమిపై మధ్యవర్తిత్వం వద్దన్నారు. మధ్యవర్తిత్వ కమిటీ భేటీలకు తమ తరఫున ఎవరూ వెళ్లడం లేదని స్పష్టం చేశారు. రాముడి జన్మ స్థలమే తమకు దైవంతో సమానమని, దాన్ని భాగాలు చేయడం లాంటి ప్రయత్నాలు దైవాన్ని విచ్ఛిన్నం చేయడమేనని ఆయన వాదించారు. ఇలాంటివి తమకు ఆమోదయోగ్యం కాదని చెప్పారు.

అక్టోబరు 18 కల్లా విచారణ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్న సుప్రీం.. సమాంతరంగా మధ్యవర్తితత్వానికి కూడా అవకాశం ఇచ్చింది. ఆ గడువులోపు కేసులో భాగమైన పిటిషనర్లందరికీ ఇష్టపూర్వకమైన నిర్ణయంతో కోర్టు ముందుకు వస్తే దాన్ని ఆమోదించేందుకు సిద్ధమని గతంలోనే చెప్పింది. అలా కానిపక్షంలో కోర్టు తన తీర్పును వెల్లడిస్తుంది.