Metro Pillar Incident : కాంట్రాక్ట్‌ రద్దు చేసే దాకా డెడ్ బాడీని తీసుకెళ్లం : తల్లిదండ్రులు

Metro Pillar Incident : కాంట్రాక్ట్‌ రద్దు చేసే దాకా డెడ్ బాడీని తీసుకెళ్లం : తల్లిదండ్రులు

బెంగళూరులో నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ కూలిపోవడంతో ఓ మహిళతో పాటు ఆమె కుమారుడు కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే తాను సర్వం కోల్పోయానని ఘటనలో మృతి చెందిన మహిళ భర్త లోహిత్ వాపోయాడు. ప్రమాదంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. తాము బైక్ పై వెళ్తుండగా ఓ సెకన్ వ్యవధిలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆవేదన వ్యక్తం చేశాడు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా భద్రతా చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దాంతో పాటు నిర్మాణ పనులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ.. కాంట్రాక్ట్‌ రద్దుచేసేంత వరకు కూతురి మృతదేహాన్ని తీసుకెళ్లబోమని మృతురాలి తండ్రి మదన్ కుమార్ హెచ్చరించారు.

ఇంత ఎత్తైన స్తంభాలు నిర్మించేందుకు వారికి ఎవరు అనుమతి ఇచ్చారన్న ఆయన.. టెండర్ రద్దు చేసి పనులు నిలిపివేయాలని, ఈ ఘటనపై కోర్టుకు కూడా వెళతానని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరిగినా ఉన్నతాధికారులెవరూ ఇక్కడికి రాలేదని, మెట్రో పిల్లర్‌ నిర్మాణ బాధ్యతలు చేపట్టిన కాంట్రాక్టర్‌ భద్రతా చర్యలు చేపట్టలేదని మృతుల కుటుంబసభ్యులు ఆరోపించారు. ఇదిలా ఉండగా బెంగళూరు మెట్రో పిల్లర్ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై  రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఇది చాలా దురదృష్టకర ఘటనగా చెప్పిన ఆయన... కాంట్రాక్టర్‌ లేదా ఇతర కారణాలపై ఏవైనా లోపాలుంటే విచారణకు ఆదేశించాలని ఆదేశాలు జారీ చేశారు.