10 ఏళ్లలో NDA సర్కార్ చేసిన అభివృద్ధి పనులు ట్రయిలర్ మాత్రమేనన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇంకా చేయాల్సింది చాలా ఉందని..దేశాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లాలన్నారు. రాజస్థాన్ చురు బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. దేశాన్ని విభజించడం, మన సైన్యాన్ని అవమానించడం కాంగ్రెస్ కు అలవాటేనని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశం అధ్వాన్న స్థితిలో ఉందని మోదీ ఆరోపించారు.
కాంగ్రెస్ పెద్ద కుంభకోణాలు, దోపిడి కారణంగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని విమర్శించారు. ప్రపంచంలో భారతదేశ ప్రతిష్ట క్షీణించిందన్న మోదీ.. . స్వాతంత్ర్యం వచ్చి చాలా దశాబ్దాలు గడిచినా, ప్రజలు కనీస అవసరాల కోసం ఇంకా కష్టపడుతున్నారని చెప్పారు. నేడు దేశంలో మోదీ హామీపై చర్చ జరుగుతోందని, మోదీ హామీలు ఏవిధంగా నెరవేరుతాయో, ఎంత స్పీడ్‌తో ఉన్నాయో చెప్పడానికి రాజస్థాన్ ఉదాహరణ అని అన్నారు.
మన సైన్యం సర్జికల్ స్ట్రైక్స్, వైమానిక దాడులు చేసినప్పుడు కాంగ్రెస్ సాక్ష్యాలు అడిగిందన్నారు ప్రధాని మోదీ. అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై మౌనంగా ఉండాలని తన కార్యకర్తలకు కాంగ్రెస్ ఆదేశించిందని చెప్పారు. తనపై ప్రతిపక్షాలు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా..తాను భయపడనన్నారు మోదీ. ఈడీ ఒక్కటే పదేళ్లలో లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను జప్తు చేసిందని, అవినీతిపరులపై ఇలాంటి చర్యలు తీసుకోకూడదా అని మోదీ ప్రజలను ప్రశ్నించారు.
మరోవైపు10 ఏళ్లలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. అవినీతిని తొలగించాలని ప్రధాని మోదీ కోరుతుంటే, ఇండియా కూటమి అవినీతి పరులను కాపాడాలంటోందని విమర్శించారు. దేశం మరింత అభివృద్ధి చెందాలంటే మోదీని మరోసారి ప్రధాని చేయాలని పిలుపు ఇచ్చారు.