బాగా పనిచేసే ఉద్యోగులకు కంపెనీలు ప్రమోషన్, బోనస్, గిఫ్ట్స్ ఇవ్వడం, అప్పుడప్పుడు రిసార్ట్స్‌కు తీసుకెళ్ళడం మామూలే. కానీ, ఆస్ట్రేలియాలోని ఒక కంపెనీ మాత్రం తన ఉద్యోగులను రెండు వారాల ‘వర్కింగ్ హాలిడే’ టూర్‌కు తీసుకెళ్ళింది. అది కూడా చాలా కాస్ట్లీ టూర్. అందుకే సోషల్ మీడియాలో వైరలైంది. ఇంతకీ విషయమేంటంటే.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ‘సూప్ ఏజెన్సీ’ అనే కంపెనీ ఉంది. ఇది డిజిటల్ మీడియా మార్కెటింగ్ చేస్తుంది. ఈ మధ్య కంపెనీ తన ఉద్యోగుల్ని ఇండోనేసియాలోని బాలి ఐలాండ్ టూర్‌కు తీసుకెళ్ళింది. ప్రపంచంలోని అద్భుతమైన టూరిస్ట్ ప్లేస్ల్లో బాలి ఒకటి. ఈ టూర్లో ఫ్లైట్ టికెట్ల నుంచి ఫుడ్ వరకు ఉద్యోగుల ఖర్చంతా కంపెనీనే పెట్టుకుంది.
అయితే, ఇది ‘హాలిడే’ టూర్ కాదు. అంటే.. ఉద్యోగులంతా టూర్‌ను ఎంజాయ్ చేస్తూనే, ఆఫీసు పని కూడా చేయాలి. అవసరమైతే మీటింగులు కూడా పెట్టుకోవాలి. అంటే ఇది ‘వర్క్ ఫ్రమ్ టూర్’ లాంటిది అన్నమాట. ఇలా ఉద్యోగులు జాలీగా ఎంజాయ్ చేస్తూనే, ల్యాప్‌టాప్‌ల్లో తమ పని చేయడాన్ని ఫొటోలు తీసి సోషల్ మీడియా అకౌంట్లో కంపెనీ పోస్ట్ చేసింది. ఇలాంటి టూర్లు మళ్ళీ ఉంటాయని కూడా చెప్పింది. అంతే ఈ పోస్ట్ వైరలైంది. కంపెనీని మెచ్చుకుంటూ కామెంట్లు వేల సంఖ్యలో వచ్చాయి. కొంతమంది నెటిజన్లు కంపెనీలో ఉద్యోగం కావాలంటూ దరఖాస్తు కూడా చేసుకున్నారు.
