ఎల్లమ్మ చెరువుకు కొత్త అందాలు..రూ.18 కోట్ల వ్యయంతో పనులు

ఎల్లమ్మ చెరువుకు  కొత్త అందాలు..రూ.18 కోట్ల వ్యయంతో పనులు
  • గ్లాస్ బ్రిడ్జి, వెల్కమ్ ఆర్చ్, గ్రీనరీ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు
  • పర్యాటక కేంద్రంగా మారనున్న హుస్నాబాద్

సిద్దిపేట/హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్ పట్టణంలోని ఎల్లమ్మ చెరువును పర్యాట కేంద్రంగా తీర్చిదిద్దడానికి వేగంగా పనులు జరుగుతున్నాయి. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​డెవలప్​మెంట్​కార్పొరేషన్ లిమిటెడ్(టీయుఐడీసీ) రూ.18 కోట్లతో సుందరీకరణ పనులను ప్రారంభించింది. ఇప్పటికే 40 శాతం పనులు పూర్తవగా వచ్చే జనవరి నాటికి మొత్తం నిర్మాణాలు పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. 

ఎల్లమ్మ చెరువు వద్ద గ్లాస్ బ్రిడ్జితో పాటు బతుకమ్మ ఘాట్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇటీవల ఆడపడచులు కొత్త ఘాట్ లో బతుకమ్మ సంబరాలు నిర్వహించుకున్నారు. ఎల్లమ్మ చెరువు  సుందరీకరణ పనులు పూర్తయితే హుస్నాబాద్ మరొక  పర్యాటక కేంద్రంగా మారే అవకాశాలు ఉన్నాయి.

 గ్లాస్ బ్రిడ్జి సరికొత్త ఆకర్షణ

ఎల్లమ్మ చెరువు సుందరీకరణలో  భాగంగా లవ్​సింబల్​ఆకారంలో నిర్మిస్తున్న గ్లాస్ బ్రిడ్జి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది. రాష్ట్రంలో ఏక్కడా లేని విధంగా చెరువు లోపల ఇరవై అడుగుల ఎత్తులో గ్లాస్ బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఇప్పటికే పిల్లర్ల పనులు పూర్తయినా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చెరువులో నీరు ఎక్కువగా ఉండడంతో  పనులు నెమ్మదించాయి. చెరువు నీటి మట్టం తగ్గగానే గ్లాస్ బ్రిడ్జి పనులు పూర్తి చేయడానికి అధికారులు ఏర్పాట్లు 
చేస్తున్నారు.  

కోమటి చెరువుకు ధీటుగా సుందరీకరణ

సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువుకు ధీటుగా ఎల్లమ్మ చెరువును అభివృద్ధి చేసే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సంకల్పించారు. సిద్దిపేట కోమటి చెరువును చూడడానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుండడంతో దానికి ధీటుగా ఎల్లమ్మ చెరువును తీర్చిదిద్ధనున్నారు. ఇప్పటికే చెరువు కట్టపై సీసీ రోడ్డు, బతుకమ్మ ఘాట్ పనులు పూర్తి కాగా, వెల్కమ్ ఆర్చ్, గ్రీనరీ, సెంట్రల్ లైటింగ్, ఐ లవ్ హుస్నాబాద్ సింబల్  వంటి పనులు జరుగుతున్నాయి. సుందరీకరణ పనులు వేగవంగా జరిగే విధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. 

సంక్రాంతి నాటికి పనులు పూర్తి 

వచ్చే సంక్రాంతి నాటికి ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నాం. మంజూరైన రూ.18 కోట్లతో చెరువు కట్టపై సీసీరోడ్డు, బతుకమ్మ ఘాట్ పనులు పూర్తి చేశాం. పెండింగ్ పనులను పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.- మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్, హుస్నాబాద్