ఈ నెలాఖరులోగా కొండపోచమ్మ సాగర్ నీళ్లు

ఈ నెలాఖరులోగా కొండపోచమ్మ సాగర్ నీళ్లు

సిద్దిపేట, వెలుగుకాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన కొండ పొచమ్మ సాగర్ రిజర్వాయర్ పనులు వడివడిగా సాగుతున్నాయి. పంపుహౌజ్, పైపింగ్​ పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. మిడ్​మానేరు నుంచి రంగనాయక సాగర్ కు గోదావరి జలాలు రాగానే.. అక్కడి నుంచి నేరుగా కొండపొచమ్మ సాగర్ కు తరలించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి నీళ్లు తరలించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

మల్లన్నసాగర్​ జాప్యంతో..

గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండలంలో కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్​ను 1,600 కోట్ల వ్యయంతో 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. వాస్తవానికి రంగనాయక సాగర్ నుంచి గోదావరి జలాలు మల్లన్న సాగర్​కు చేరుకోవాలి. తర్వాత కొండ పొచమ్మ సాగర్ కు తరలించాల్సి ఉంది. కానీ మల్లన్నసాగర్ పనులు ఆలస్యం అవుతుండటంతో అక్కడ నీళ్లను ఆపలేని పరిస్థితి ఉంది. దీంతో మల్లన్నసాగర్ రిజర్వాయర్ సమీపం నుంచి నీటిని డైవర్ట్ చేసి 18 కిలోమీటర్ల దూరంలోని కొండ పొచమ్మ సాగర్ ప్రధాన కాల్వకు కలిపి అక్కారం పంపుహౌజ్ కు తరలిస్తారు. ఈ డైవర్షన్ కెనాల్ పనులు పూర్తయ్యాయి. అక్కారం పంపుహౌజ్ నుంచి కొండపొచమ్మ సాగర్ కు నీళ్లు ఎత్తిపోస్తారు. ఈ పంపుహౌజ్​లో 30 మెగావాట్ల కెపాసిటీ కలిగిన ఆరు మోటార్ల ఏర్పాటు పనులు దాదాపు పూర్తయ్యాయి.

‘ముంపు’ జనం తరలింపు

కొండపొచమ్మ సాగర్ కింద మునిగిపోతున్న మామిడాల, బైలంపూర్, తానేదార్పల్లి గ్రామాల ప్రజలను తరలించే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. వారికి ములుగు మండల పరిధిలోని తునికి బొల్లారంలో నిర్మించిన ఆర్అండ్ఆర్ కాలనీలో ఇండ్లు కేటాయించారు. తానేదార్ పల్లి తండా జనం ఇటీవలే గ్రామాన్ని ఖాళీ చేశారు. మిగతా రెండుళ్ల వారిని తరలించి, ఆ గ్రామాలకు వెళ్లే రోడ్డును మూసి, మిగతా రిజర్వాయర్​ కట్ట పనులను పూర్తి చేయనున్నారు. పది పదిహేను రోజుల్లో అన్ని పనులు పూర్తిచేస్తామని ప్రాజెక్టు ఎస్ఈ వేణు తెలిపారు.