లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయండి : నడ్డా

లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయండి :   నడ్డా

న్యూఢిల్లీ, వెలుగు :  లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 ఎంపీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని రాష్ట్ర పార్టీ శ్రేణులకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. మంగళవారం ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీసులో దాదాపు 5 గంటల పాటు అగ్రనేతలు నడ్డా, అమిత్‌‌ షా కీలక భేటీ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో తెలంగాణ నుంచి నేషనల్ జనరల్ సెక్రటరీలు బండి సంజయ్‌‌, తరుణ్‌‌ చుగ్, సునీల్‌‌ బన్సల్‌‌ తో పాటు స్టేట్ జనరల్ సెక్రటరీగా కొత్తగా నియమితులైన చంద్రశేఖర్, గుజ్జుల ప్రేమేందర్‌‌ రెడ్డి, బంగారు శృతి, దుగ్యాల ప్రదీప్‌‌ కుమార్, కాసం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పని చేయాలని అగ్ర నేతలు సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.

బన్సల్, చంద్రశేఖర్ తో రాష్ట్ర నేతల భేటీ..  

రాష్ట్ర జనరల్ సెక్రటరీ (సంస్థాగత)గా నియమితులైన చంద్రశేఖర్ కు ఢిల్లీలోని బీజేపీ హెడ్ ఆఫీసులో రాష్ట్ర నేతలు స్వాగతం పలికారు. సునీల్‌‌ బన్సల్, చంద్రశేఖర్‌‌ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని తాజా పరిస్థితులపై చర్చించారు. రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు గెలుచుకునే దిశగా చేపట్టాల్సిన అంశాలపై సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టిసారించాలని సూచించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో ట్రై యాంగిల్ ఫైట్ కనిపిస్తున్న నేపథ్యంలో  అన్ని వర్గాలను బీజేపీ వైపు మళ్లించేలా ముందుకుసాగాలని నిర్ణయించారు.