సంగారెడ్డి జిల్లాలో ట్యూబ్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి

సంగారెడ్డి జిల్లాలో ట్యూబ్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి
  •     నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యం 
  •     ఫ్యాక్టరీ ముందు సీఐటీయూ నేతల ఆందోళన 
  •  సంగారెడ్డి జిల్లా బుచ్చినెల్లి శివారులో ఘటన

జహీరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల్లాలోని పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ఓ కార్మికుడు చనిపోయాడు. ఈ విషయాన్ని యాజమాన్యం గోప్యంగా ఉంచడంతో సీఐటీయూ నేతలు కంపెనీ ఎదుట ఆందోళన చేపట్టారు. మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి నష్టపరిహారం అందిస్తానమని హామీ ఇవ్వడంతో విరమించారు. వివరాల్లోకి వెళ్తే.. జహీరాబాద్ మండలం బుచ్చినెల్లి శివారులోని మంగళ ట్యూబ్స్ కంపెనీలో గురువారం పనిచేస్తూ.. అసోం రాష్ట్రానికి చెందిన కార్మికుడు రోహిత్ గోగోయ్(39), ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఘటనపై తెలిసిన వెంటనే సీఐటీయూ నేతలు వెళ్లగా.. ఫ్యాక్టరీ యాజమాన్యం గేట్లను మూసివేసింది. 

దీంతో కార్మికుడికి న్యాయం చేయాలని యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫ్యాక్టరీ ముందు ఆందోళనకు దిగారు. యాజమాన్య ప్రతినిధులకు, సీఐటీయూ నేతలకు మధ్య వాగ్వాదం, ఘర్షణ జరిగింది. చిరాక్ పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి జోక్యం చేసుకుని ఇరువర్గాలతో చర్చించారు. దీంతో ఫ్యాక్టరీ యాజమాన్యం  దిగొచ్చి మృతుడి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేందుకు ఒప్పుకుంది. 

ఒకరికి పర్మినెంట్ జాబ్ , రూ. 5 లక్షలు పరిహారం, అంత్యక్రియల ఖర్చులకు రూ.2 లక్షలు, డెడ్ బాడీ ట్రాన్స్ పోర్ట్ చార్జీ కింద రూ. 2 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చింది. సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి, జహీరాబాద్ ఇండస్ట్రియల్ క్లస్టర్ కన్వీనర్ ఎస్.మహిపాల్, కార్మిక యూనియన్ల ప్రధాన కార్యదర్శులు నరేశ్, మహేశ్వర్, సందీప్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.