
ఐదు రూపాయల బిస్కెటో చాక్లెటో అమ్ముకోడానికి అష్టకష్టాలు పడుతున్నామని ఓ పక్క కంపెనీలు గగ్గోలు పెడుతున్నప్పుడు, అసలు ఇండియాలో మాంద్యం ఉందా ? లేదా అనే వాదనకు అర్థమే లేదు. ఇండియాలో ఎప్పటి నుంచో ఆదాయం, సంపద, వినియోగాలలో బ్యాలెన్స్ కుదరడం లేదు. అంటే, కొంత మంది సంపాదన, సంపద చాలా ఎక్కువగా ఉంటే, మరోవైపు ఎక్కువ మంది సంపాదన, సంపద అరకొరగా ఉంటోంది. సంపాదన, సంపదలను బట్టే వినియోగం ఉంటుంది. ఎంతో ఖరీదైన వజ్రాలు, కార్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు వంటి వాటిని ఈజీగా కొనగల సంపన్నులూ ఇండియాలో ఉన్నారు. అలాగే, అతి తక్కువ ధరలో బిస్కెట్లుకొనడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచించే కార్మికులూ ఉన్నారు. ఇలాంటి అసమానతలు ఉన్నప్పటికీ, ఆశ్చర్యకరంగా ఇండియా జర్నీ ప్రశాంతంగా సాగిపోతోంది.
న్యూఢిల్లీ : చాలా తక్కువ రేటు ఉండే స్నాక్ కొనలేనంతగా పల్లెల్లోని కార్మికులు, పట్టణాలలోని ఓ మాదిరి ఉద్యోగుల కొనుగోలు శక్తి పడిపోయిందంటే, పరిస్థితి ఎంత అధ్వాన్నంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. దీనికి అసలైన కారణం ఏళ్ల తరబడి పెరగని జీతాలే. ఇది దేశాన్ని దీర్ఘకాలంగా పీడిస్తున్న సమస్య. ఈ సమస్యను అర్జంట్‌గా పట్టించుకుని, పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉంది. దేశంలో తమ అమ్మకాలు పడిపోతున్నాయంటూ ప్రముఖ బిస్కెట్ తయారీదారు బ్రిటానియా ఇండస్ట్రీస్ గగ్గోలు పెట్టింది. తమదీ అదే పరిస్థితని ఇదే రంగంలోని మరో కంపెనీ వెంటనే ప్రకటించింది. అంతే కాదు, పది వేల మంది కార్మికులను ఇంటికి పంపనున్నట్లు కూడా పార్లే వెల్లడించింది. వినియోగం తగ్గిపోవడానికి గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్సే (జీఎస్టీ) కారణమంటూ దుమ్మెత్తిపోశారు పార్లే సీఈఓ. 2016 నాటి పెద్ద నోట్ల రద్దు నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోకుండానే జీఎస్టీని అమలులోకి తేవడం పెద్ద తప్పయిపోయిందని ఆయన వాదన. ఇందులో నిజం ఎంతున్నా, దేశంలో కార్మికుల జీతాలు సరిపడేంతగా లేకపోవడమే అసలైన కారణం.
కార్మికుల వాటా పెరగాలి..
ఆర్థిక వ్యవస్థలోని మూడో వంతు మాత్రమే కార్మికుల చేతికి ఇటీవలి కాలంలో ముడుతోంది. మిగిలినదంతా దేశంలోని అప్పు, ఈక్విటీ మార్కెట్లలోకే మళ్లుతోందని ఇండియా రేటింగ్స్ రిపోర్టు చెబుతోంది. ప్రస్తుతం 33.2 శాతంగా ఉన్న కార్మికుల వాటాను కనీసం 34.7 శాతానికి పెంచగలిగినా వారి ఏడాది కొనుగోలు శక్తి 100 బిలియన్ డాలర్ల మేర అధికమవుతుందని పేర్కొంది. అప్పుడే ఇండియా ఆర్థిక వ్యవస్థ సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటుందని, మరింత ఉన్నతస్థాయికి ఎదుగుతుందని మెకెన్సీ నివేదిక అభిప్రాయపడింది. అంటే, ఈ టార్గెట్ చేరుకోవడానికి ఇండియా ఇంకా చాలా ప్రయాణం చేయాల్సి ఉంది. అమెరికా ఆర్థిక వ్యవస్థలో 2016 లో కార్మికులకు చేరిన వాటా 57 శాతం. రెండో ప్రపంచ యుద్ధం నాటితో పోలిస్తే ఇది పది శాతం తక్కువని, టెక్నాలజీ మార్పులు, గ్లోబలైజేషనే ఆ తగ్గుదలకు కారణమని మెకిన్సే అండ్ కో చెబుతోంది. ఇండియాలో సంపద పంపిణీ.. పై నుంచి చూస్తే కొంత ఓకే అనిపించినా, తరచి చూస్తే చాలా దారుణంగానే ఉంటుంది. అసంఘటిత రంగం (ఇన్‌ఫార్మల్ సెక్టర్) ఉత్పత్తిలో 80 శాతం ఆ ఉత్పత్తికి కారణమైన మూలధన చెల్లింపులకే (అప్పులు, వాటి మీద వడ్డీలు) సరిపోతోందని ఇండియా రేటింగ్స్ విశ్లేషిస్తోంది. అంటే, కేవలం మిగిలిన 20 శాతమే ఆరుగాలం కష్టపడే రైతులకు, కాటేజ్ ఇండస్ట్రీలకు చేరుతోందన్న మాట. అదేవిధంగా, ప్రభుత్వ రంగ సంస్థల ఉత్పత్తిలో 32 శాతం వాటా మాత్రమే టాక్స్ పేయర్లు, బ్యాంకులతో పంచుకుంటుంటే, మిగిలిన 68 శాతం ప్రభుత్వ రంగంలోని పరిమిత కార్మికులకు చేరుతోంది. ప్రైవేటు రంగంలోని కార్మికులతో పోలిస్తే వీరు అధిక భద్రతతోపాటు, అధిక జీతాలు పొందుతున్నారు. ఎయిర్ ఇండియా వంటి తెల్ల ఏనుగులను తొందరగా ప్రైవేటీకరించడం వల్ల ప్రభుత్వ రంగంలో మూలధన వ్యర్థం పరిమితమవుతుంది. ప్రైవేటీకరించడం వల్ల ఆటోమేటిక్‌గా ప్రైవేటు రంగంలోని ఇన్‌ఫార్మల్ సెక్టర్‌కు ప్రయోజనం కలగదు.
మేలు చేయని జీఎస్టీ
పన్ను వ్యవస్థను మార్చడం ద్వారా మార్పు వస్తుందని మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నమ్మారు. అందుకే చిన్న సంస్థలను కూడా పరిధిలోకి తెస్తూ జీఎస్టీని అమలు చేశారు. డిజైన్‌తోపాటు, అమలులోనూ జీఎస్టీ విఫలమైంది. జీఎస్టీ అమలులోకి వచ్చిన రెండేళ్ల తర్వాత రెవెన్యూ టార్గెట్స్ చేరుకోలేకపోవడంపై కేంద్రం గుర్రుగా ఉంది. ఆటోమొబైల్స్ నుంచి బిస్కెట్స్ తయారీదారులదాకా అనేక మంది జీఎస్టీ తగ్గించమని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఐతే, వారు కోరినట్లుగా జీఎస్టీ తగ్గించి, మన్ననలు పొందడం అంత సులభమైనదేమీ కాదు. ఎందుకంటే, అది నేరుగా ప్రభుత్వ ఆదాయంపై ప్రభావం చూపెడుతుంది. పన్నులలో మార్పు ఒకటే ఆర్థిక వ్యవస్థలో కావల్సిన మార్పులను తీసుకురాలేదు. దాంతోపాటు, పాతపడిపోయిన కార్మిక చట్టాలను మార్చడం కూడా కీలకమే. ఆర్థికంగా బలమైన సంస్థలు కొంత ఎక్కువ జీతాలే చెల్లించగలుగుతాయి. కాకపోతే, తమకు అవసరమైనప్పుడు మాత్రమే ఉద్యోగాలు కల్పించడానికి ఇష్టపడతాయి. పని లేనప్పుడు ఉద్యోగులను తీసివేయాలనుకుంటాయి. ఇందుకనుగుణంగా కార్మిక విధానాలలో మార్పులు రావాల్సి ఉంటుంది. ఇక అటువైపు, చిన్న చిన్న వ్యాపార సంస్థలకు అత్యంత కీలకమైనవి ఆర్థిక వనరులు. గత ఏడాది కాలంగా షాడో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న లిక్విడిటీ సంక్షోభం ఇంకా వీడిపోలేదు. దీంతో ఆస్తులను తనఖా పెట్టి అప్పులు తీసుకునే విభాగం బాగా తగ్గిపోయింది. సాధారణంగా వ్యాపార రంగంలోని మిడ్‌సైజ్ సంస్థలే ఈ విధమైన అప్పులు ఎక్కువగా తీసుకుంటాయి. చాలా చిన్న సంస్థల వద్ద ఇన్‌వాయిస్‌లు, ఇన్వెంటరీ తప్ప తనఖా పెట్టడానికి ఏమీ ఉండవు. అలాంటి చిన్న సంస్థలకు అప్పులు ఇచ్చే నాథుడే మార్కెట్లో లేడు.