పట్టింపుల్ని పక్కనపెట్టి కత్తెర పట్టింది

పట్టింపుల్ని పక్కనపెట్టి కత్తెర పట్టింది

ఆడవాళ్లు వంటిల్లు దాటారు. అన్ని రంగాల్లో ఒక మెట్టు పైనే ఉంటున్నారు. బ్యూటీ, ఫ్యాషన్​ వరల్డ్​లోనూ  తమ మార్క్​ చూపెడుతున్నారు. కానీ, నాణేనికి మరో వైపు..మంగలి లాంటి కులవృత్తులకి మాత్రం దూరంగానే ఉంటున్నారు. దాన్ని కేవలం మగవాళ్ల పనిగానే చూస్తోంది సొసైటీ కూడా. ఆ ఆలోచనలో మార్పు తేవాలనుకుంది లావణ్య. ఆ మార్పుకి తనే కారణం అవ్వాలనుకుంది. అందుకే పట్టింపులన్నింటినీ వెనక్కినెట్టి  కత్తెర పట్టింది. తను ఇటుగా అడుగులేయడానికి మరో కారణం పేదరికం అంటోంది లావణ్య. 
బార్బర్​గా మారింది
లేడి బార్బర్​గా రాణిస్తున్న లావణ్య పదోతరగతి వరకు చదువుకుంది. చిన్నప్పుడు తండ్రిని చూసి తనూ బార్బర్​ అవ్వాలనుకుంది. కానీ, ఆ వృత్తిలో ఆడవాళ్లు ఎవరూ లేకపోవడంతో... ఎవరేం అనుకుంటారోనని  మౌనంగా ఉండిపోయింది. కుట్టు మెషిన్​ నేర్చుకుంది. ఆలోపే శ్రీనివాస్​తో పెండ్లయింది. అతను కూడా బార్బరే అవడంతో డిఫరెంట్​  హెయిర్, బియర్డ్​ స్టయిల్స్​​ గురించి అడిగి తెలుసుకునేది లావణ్య. కానీ, కరోనా వల్ల ఇరవై యేండ్లుగా నడుస్తున్న తన భర్త బార్బర్​ షాప్​ మూతపడింది. కూలీనాలీ చేసి లావణ్య అరకొర సంపాదించినా అవి ఇంటి ఖర్చులకి కూడా సరిపోలేదు. దాంతో  అప్పుల ఊబిలో చిక్కుకుంది లావణ్య కుటుంబం. వాటి నుంచి బయటపడడానికి చేయని ప్రయత్నం లేదు... కానీ, అవేమీ వాళ్ల కష్టాలు తీర్చలేదు. దాంతో భర్తతో కలిసి తనూ కత్తెర పట్టాలనుకుంది. ఆమె ఆలోచనకి భర్త అండగా నిలిచాడు. ఐదు నెలలు ట్రైనింగ్​ ఇచ్చి డిఫరెంట్​ హెయిర్​ కట్​లు, బియర్డ్​ స్టయిల్స్​ నేర్పించాడు. మిగతా కుటుంబ సభ్యులు  కూడా సపోర్ట్​ చేయడంతో భర్తతో కలిసి బార్బర్​ షాపు నడుపుతోంది లావణ్య. 
 

మా ఆయన సపోర్ట్​తో..
తాతముత్తాతల కాలం నుంచి మా కుటుంబంలోని మగవాళ్లంతా ఈ వృత్తిలోనే ఉన్నారు. కానీ, మా ఫ్యామిలీలోని ఆడవాళ్లు ఇటువైపు రావడం మాట అటుంచితే.. కనీసం బార్బర్​ షాపులో అడుగు కూడా పెట్టలేదు.  కేవలం మా కుటుంబంలోనే కాదు.. అసలు ఈ వృత్తిలోనే  ఆడవాళ్లు లేరు. అందరూ బార్బర్​ పని అంటే మగవాళ్లకి మాత్రమే అన్నట్టు చూస్తున్నారు కూడా. అయినా సరే నేను భయపడలేదు. అప్పుడు నేనున్న పరిస్థితులు అలాంటివి.  కులవృత్తిలోకి వస్తానంటే మా ఆయన కూడా సపోర్ట్​ చేశాడు. దగ్గరుండి నాకు పర్ఫెక్ట్​ ట్రైనింగ్​ ఇచ్చాడు. ఇప్పుడు పని మీద మా ఆయన ఏదైనా ఊరు వెళ్లాల్సి వస్తే.. నేనే షాపు చూసుకుంటున్నా. పెద్దవాళ్లతో పాటు పిల్లలకి కూడా అన్ని రకాల హెయిర్​ కట్​లతో పాటు షేవింగ్​ చేస్తున్నా.  నాకు అందరూ సపోర్ట్​ ఇస్తున్నారు అంది లావణ్య.      ::: సిద్దిపేట, వెలుగు