మంత్రి సబిత సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలే

మంత్రి సబిత సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలే
  • మహేశ్వరంలో బీఆర్ఎస్ నేతల భూ కబ్జాలు
  • డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలోనూ అక్రమాలు
  • బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి ఆరోపణలు

శంషాబాద్, వెలుగు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మహేశ్వరం నియోజకవర్గంలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని బీజేపీ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి సుదర్శన్ రెడ్డి విమర్శించారు. మహేశ్వరంలోని మంచన్ పల్లి చౌరస్తాలో శనివారం బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. చీఫ్ గెస్టుగా హాజరైన సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. మహేశ్వరం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. 

మంత్రి సబిత సొంత నియోజకవర్గమైనప్పటికీ ఇప్పటివరకు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. పెండ్లిళ్లకు, ఫంక్షన్లకు వచ్చి ఫొటోలు దిగడమే తప్ప మహేశ్వరం సెగ్మెంట్​ను మంత్రి పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు మంత్రి బినామీలుగా మహేశ్వరంలో అడ్డగోలుగా భూములు కొని జనాలను మోసం చేస్తున్నారన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలోనూ స్థానికులకు అన్యాయం జరిగిందని సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో సబితా ఇంద్రారెడ్డిని గద్దె దింపడం ఖాయమన్నారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు పాల్గొన్నారు.