
- ఆర్టీసీలో పనిగంటలు పెంచిన్రు ఓటీలు కోసిన్రు!
- ఉద్యోగులపై పనిభారం మోపుతున్న యాజమాన్యం
- 8 నుంచి 10 గంటలకు పని వేళల పెంపు
- నాలుగు గంటలు ఎక్కువ పనిచేసినా గంటన్నరే ఓటీ
- ‘141’ షీట్ బంద్ పెట్టి అధికారులే ఓటీలేస్తున్రు
- రెండు పే స్కేల్స్, ఐదు డీఏలు పెండింగ్
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగులకు పనిగంటలు పెంచి పనిభారం మోపుతున్న ఆర్టీసీ యాజమాన్యం.. ఓటీ (ఓవర్ టైం) అలవెన్స్‌లో కోత పెడుతున్నది. ఎంప్లాయీస్ పొట్టగొడుతున్నది. ఓటీ డబ్బులు తగ్గడంతో గతంతో పోలిస్తే జీతాలు తక్కువగా వస్తున్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. రెండు పే స్కేల్స్, ఐదు డీఏలు ఇవ్వకపోగా.. రివర్స్‌లో ఇలా జీతాల్లో కోత పెట్టడంపై మండిపడుతున్నారు. ఆర్టీసీలో యూనియన్లు యాక్టివ్‌గా లేకపోవడం వల్ల కూడా ఉద్యోగులు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది.
‘141’ షీట్ బంద్
ఆర్టీసీలో 49 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో ఎక్కువ మంది డ్రైవర్లు, కండక్టర్లే ఉన్నారు. మామూలు రోజుల్లో ఎనిమిది గంటలు పనిచేయాల్సి ఉంటుంది. దానికి మించి పనిచేస్తే ఓటీలు ఇచ్చేటోళ్లు. ఉద్యోగి బేసిక్ పేను బట్టి గంటల లెక్కన ఓటీ పైసలు వచ్చేటివి. ఓటీని ఫైనల్ చేసేందుకు బస్సులో డ్రైవర్ లేదా కండక్టర్‌కు 141 షీట్ ఇచ్చేవారు. అందులో ఏ రూట్లో వెళ్లారు? ఎన్ని స్టాప్‌లు ఉన్నాయి? ఎన్ని గంటలు పనిచేశారు? తదితర వివరాలు ఉండేవి. వాటిని బట్టి ఓటీ డబ్బులను ఇచ్చేటోళ్లు. టిమ్స్(టికెట్ ఇష్యూయింగ్ మెషీన్లు) వచ్చాక కూడా ఈ షీట్ల విధానం కొనసాగింది. నెలాఖరున షీట్లన్నీ లెక్క తీసి.. ఓటీలు ఫైనల్ చేసేవారు. కండక్టర్లు లేదా డ్రైవర్లు సంతకం చేసిన తర్వాతే ఓటీలు కట్టించేవారు. కానీ, కొంత కాలంగా ఆర్టీసీ యాజమాన్యం ఈ షీట్లను ఇవ్వడం మానేసింది. దీంతో ఆఫీసర్లు ఓటీని తగ్గించి వేస్తున్నారు. నాలుగు గంటలు ఎక్కువ పనిచేసినా గంట నుంచి గంటన్నరే చేసినట్టు రాస్తున్నారు. దీంతో ఉద్యోగులు నష్టపోతున్నారు.
పని గంటలు పెంచిన్రు
కొన్ని రోజల క్రితం వరకు ఉద్యోగులకు 8 గంటల డ్యూటీలే ఉండేవి. ఈ మధ్యే వివిధ కారణాలు చెప్తూ డ్యూటీ టైమ్‌ను 10 గంటలకు పెంచారు. ఆ తర్వాత అదనంగా పనిచేసిన గంటలకు మాత్రమే ఓటీ లెక్కగట్టి ఇస్తున్నారు. దాంతో పాటు లాంగ్ రూట్లో ఒక ట్రిప్ వెళ్లొస్తే.. తెల్లారి సెలవు ఉండేది. ఇప్పుడు రెండు రోజుల్లో మూడు ట్రిప్పులు పూర్తిచేస్తేనే మర్నాడు సెలవు ఇస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే పీఆర్సీని అమలు చేస్తున్నా.. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు మాత్రం ఇప్పటికీ పీఆర్సీ పత్తానే లేదు. సంస్థలో రెండు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయి. 2017, 2021 ఏప్రిల్ ఒకటో తేదీల నుంచి పీఆర్సీలు అమలు కావాల్సి ఉంది. కానీ నాలుగేండ్లు దాటినా నేటికీ అమలు కాలేదు. ఫిట్మెంట్ ప్రకటించకపోవడంతో సమ్మె చేస్తామంటూ 2018 జూన్‌లో ఆర్టీసీ యూనియన్లు హెచ్చరించాయి. దీంతో అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల మంత్రుల కమిటీ యూనియన్ నేతలతో చర్చించింది. 16 శాతం ఐఆర్‌ను ప్రకటించింది. పీఆర్సీ మాత్రం రాలేదు. 2013 నాటి పీఆర్సీ బాండ్ల డబ్బులూ ఇంకా అందలేదు. ఇక ఐదు డీఏలూ పెండింగ్‌లోనే ఉన్నాయి. జనవరి వస్తే మరో డీఏ చెల్లించాల్సి వస్తుంది.
టిమ్స్ సక్కగ పనిచేస్తలేవ్
బస్సుల్లో కండక్టర్లకు ఇచ్చే టిమ్స్ సరిగా పనిచేయట్లేదు. రాష్ట్రమంతటా 50 నుంచి 60 శాతం వరకు మెషీన్లు పాడైపోయాయని కండక్టర్లు వాపోతున్నారు. మెషీన్ల నుంచి ప్రింట్ కూడా సక్కగ రావడంలేదు. వచ్చిన ప్రింట్లూ క్లారిటీగా ఉండటం లేదు. కొన్ని సందర్భాల్లో టికెట్‌పైన ప్రింట్ అయిన వివరాలు సరిగ్గా కనిపించక.. చెకింగ్ టైంలో ఇబ్బందులొస్తున్నాయని కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఉద్యోగుల కడుపు కొట్టడం సరికాదు
గతంలో 141 షీట్లో అన్ని వివరాలుండేవి. ఇప్పుడు వాటిని బంద్ పెట్టిన్రు. అధికారులే ఓటీలను ఇష్టమొచ్చినట్టు వేస్తున్నరు. ఓటీల్లో గంటలకొద్దీ కోతలు పెడ్తున్నరు. పని సమయాన్ని 8 గంటల నుంచి 10 గంటలకు పెంచారు. లాంగ్ ట్రిప్ డ్రైవర్లకు తెల్లారి హాలీడే ఇవ్వకుండా రెండ్రోజులకొకటి అడ్జస్ట్ చేస్తున్నారు. పీఆర్సీ, డీఏలు ప్రకటించకున్నా కష్టపడి పనిచేస్తున్న ఉద్యోగుల కడుపు కొట్టడం సరికాదు.
- హనుమంతు ముదిరాజ్, జనరల్ సెక్రటరీ, టీజేఎంయూ