పోలీసుల పహారా నడుమ చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభం

పోలీసుల పహారా నడుమ చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు ప్రారంభం

గద్వాల, వెలుగు: వందల మంది పోలీసుల పహారా నడుమ జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలంలోని చిన్నోనిపల్లి రిజర్వాయర్ పనులు ఆదివారం ప్రారంభమయ్యాయి. నెట్టెంపాడు లిఫ్ట్ స్కీంలో భాగంగా ఇక్కడ నిర్మిస్తున్న రిజర్వాయర్ ను రద్దు చేయాలనే డిమాండ్ తో 421 రోజులుగా నిర్వాసితులు చేస్తున్న దీక్షలను పోలీసులు శనివారం భగ్నం చేశారు. దీక్ష శిబిరంలో ఉన్న 40 మంది రైతులను అరెస్ట్​చేసి శాంతినగర్ పోలీస్​స్టేషన్​కు తరలించారు. ఆదివారం మబ్బులనే మళ్లీ ఊర్లోకి వచ్చిన పోలీసులు మరో 15 మంది రైతులను అరెస్ట్​ చేసి స్టేషన్ కు తరలించారు. పోలీసుల భయంతో మిగతా రైతులు, యువకులు ఊరువిడిచి పారిపోయారు. ప్రస్తుతం గ్రామం మొత్తం నిర్మానుష్యంగా మారిపోయింది. 

మేం టెర్రరిస్టులమా?

శనివారం పొద్దున నిర్వాసితులను అరెస్టు చేసిన పోలీసులు వారిని రెండు రోజులుగా వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతున్నారు. దీంతో ఆగ్రహించిన నిర్వాసితులు సెల్ఫీ వీడియో తీసి సోషల్​మీడియాలో పెట్టారు. ‘మమ్మల్ని ఎందుకు పోలీస్​స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు.. మేం టెర్రరిస్టులమా.. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం సరికాదు.. కనీసం తిండి, నీళ్లు కూడా ఇస్తలేరు.. ఇదేమి రాజ్యం.. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యం..’ అంటూ వీడియోలో ప్రశ్నించారు.

మా వాళ్లెక్కడ?

‘ఊర్లోని మగవాళ్లందరినీ అరెస్టు చేసి, రిజర్వాయర్​ పనులు చేస్తున్నారు. మేం ఏం నేరం చేశాం? ముందు మా వాళ్లు ఎక్కడున్నారో చెప్పాలి’ అంటూ మహిళలు పోలీసులను నిలదీశారు. ఆదివారం ఉదయం పనులు అడ్డుకునేందుకు మహిళలు ముందుకు వచ్చారు. పోలీసులు వారిని మళ్లీ ఊర్లోకి పంపించేశారు. మరోవైపు నిర్వాసిత రైతులు, గ్రామస్థులను పరామర్శించేందుకు వెళ్లిన బీజేపీ లీడర్లను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని ఐజ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

2005లో మొదలుపెట్టి..

చిన్నోనిపల్లి రిజర్వాయర్ కోసం 2005లో సర్వే చేశారు. 2006లో 2,650 ఎకరాల భూమి సేకరించారు. రిజర్వాయర్​లో చిన్నంపల్లి గ్రామానికి చెందిన 251 ఇండ్లు ముంపునకు గురవుతాయని గుర్తించారు. వాటికి పరిహారం చెల్లించినా రిజర్వాయర్ పనులు మొదలుపెట్టలేదు. ఎలాంటి ఆయకట్టు లేని రిజర్వాయర్ రద్దు చేసి తమ భూములు తమకు ఇవ్వాలని ముంపునకు గురవుతున్న ఐదు  గ్రామాల నిర్వాసితులు 421 రోజులుగా దీక్షలు చేస్తున్నారు.