- అవగాహన కార్యక్రమాల్లో కలెక్టర్లు
- జిల్లీ కేంద్రాల్లో భారీ ర్యాలీలు
నిర్మల్/ఆదిలాబాద్టౌన్/మంచిర్యాల, వెలుగు: ఎయిడ్స్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. సోమవారం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు అవగాహన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ర్యాలీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఎయిడ్స్ వ్యాధిపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల కోసం జిల్లాలో ఎయిడ్స్ నిర్ధారణ, కౌన్సిలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, డీఎంహెచ్ఓ రాజేందర్, డీఎల్ఎస్ఏ సెక్రటరీ రాధిక, డీఈవో భోజన్న, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్లో ర్యాలీ
ప్రతి ఒక్కరిరూ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని ఆదిలాబాద్కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా డీఎంహెచ్వో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైద్య సిబ్బంది ఎయిడ్స్ వ్యాధిపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాజేశ్వర్, డీఎంహెచ్ వో నరేందర్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డాక్టర్ శ్రీధర్, వైద్య సిబ్బంది, స్టూడెంట్లు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా హెచ్ఐవీ ఎయిడ్స్ సమీకృత వ్యూహ సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు ఎయిడ్స్ పై అవగాహన కల్పించి, వ్యాస రచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు.
