- కలెక్టర్ పమేలాసత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు : హెచ్ఐవీ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ పమేలాసత్పతి వైద్య సిబ్బందికి సూచించారు. ప్రపంచ ఎయిడ్స్ డే ను పురస్కరించుకుని సోమవారం సిటీలోని డీఎంహెచ్వో ఆఫీస్ నుంచి ఫిలిం భవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని డీఎంహెచ్వో ఆఫీస్ వద్ద జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. హెచ్ఐవీపై అవగాహన పెంచి, అపోహలను తొలగించాలని ప్రతిజ్ఞ చేయించారు.
అనంతరం విశిష్ట సేవలందించిన ఐసీటీసీ కౌన్సిలర్లకు ప్రశంసాపత్రాలను ఇచ్చారు. ఎయిడ్స్ పై నిర్వహించిన ఉపన్యాస పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన కాలేజీ విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్ వో వెంకటరమణ, ఏడీఎంహెచ్ వో డాక్టర్ సుధా, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎయిడ్స్ కు చికిత్స కంటే నివారణే ముఖ్యం
జగిత్యాల టౌన్, వెలుగు : ఎయిడ్స్ వ్యాధికి చికిత్స కంటే నివారణే ముఖ్యమని అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ తెలిపారు. ప్రపంచ ఎయిడ్స్ వ్యాధి నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జిల్లా వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అడిషనల్ కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఎయిడ్స్వ్యాధిపై అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.
యువత ఎట్టి పరిస్థితుల్లో ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీ కుటుంబాన్ని కాపాడాలని సూచించారు. సమాజాన్ని, ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో డీఏంహెచ్ వో ప్రమోద్ కుమార్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపాల్ సునీల్ కుమార్, జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ కృష్ణమూర్తి, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
